హైదరాబాద్‌లో యాపిల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ | Apple Experience Center in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో యాపిల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌

May 29 2026 4:17 AM | Updated on May 29 2026 4:17 AM

Apple Experience Center in Hyderabad

టీ–హబ్‌ వద్ద 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు 

దసరా నాటికి వినియోగదారులకు అందుబాటులోకి 

సర్వీస్, కాల్‌ సెంటర్‌తోపాటు బ్యాకెండ్‌ సపోర్ట్‌ కూడా.. 

గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌గా తీర్చిదిద్దనున్న కంపెనీ 

మొత్తం 3 లక్షల చదరపు అడుగుల్లో భవనం

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌.. హైదరాబాద్‌లో దసరా నాటికి ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. రాయదుర్గంలోని టీ–హబ్‌ సమీపంలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది కొలువుదీరనుంది. ఎక్స్‌పీరియెన్స్‌ సెంటర్‌తోపాటు సర్వీస్, కాల్‌ సెంటర్‌ సైతం ఏర్పాటు చేయనుంది. బ్యాకెండ్‌ సపోర్ట్‌ టీమ్‌ కూడా ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించనుంది. వాటన్నింటి కోసం కంపెనీ మొత్తంగా సుమారు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం లీజుకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేంద్రాన్ని గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌గా (జీసీసీ) యాపిల్‌ తీర్చిదిద్దనుందని సమాచారం. దాదాపు 1,400 మంది సిబ్బంది వరకు ఇక్కడ కూర్చునే వీలుంది. డేటా ప్రొటెక్షన్, మెడికల్, కమ్యూనికేషన్, ఏఐ, నేవిగేషన్‌ సిస్టమ్, ట్రాఫిక్‌ సర్వేలెన్స్, వాయిస్‌ రికగ్నిషన్‌ తదితర విభాగాలకు చెందిన సాంకేతిక నిపుణులు విధులు నిర్వర్తిస్తారు. డిజిటల్‌ ఆపరేషన్స్‌ కూడా ఇక్కడి నుంచే జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే గచ్చిబౌలిలోని వేవ్‌రాక్‌లో యాపిల్‌కు జీసీసీ ఉంది. హైదరాబాద్‌లోని రెండు జీసీసీల కోసం కొత్తగా 3,500 మందిని యాపిల్‌ నియమించుకుందని తెలుస్తోంది. 

ఇవీ ప్రత్యేకతలు.. 
– యాపిల్‌కు ముంబైలో రెండు, పుణే, ఢిల్లీ, బెంగళూరు, నోయిడాలలో ఒక్కో అధికారిక స్టోర్‌ (ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌) ఉన్నాయి. 
– సాధారణ మొబైల్‌ షాపుల కంటే భిన్నంగా వినియోగదారులకు సరికొత్త గ్లోబల్‌ షాపింగ్‌ అనుభవాన్ని ఇవి అందిస్తాయి. ప్రతి స్టోర్‌ డిజైన్‌ అక్కడి నగర ప్రత్యేకతను ప్రతిబింబిస్తుంది. 
– ఐఫోన్స్, ఐప్యాడ్స్, మ్యాక్‌బుక్స్, యాపిల్‌ వాచెస్, ఎయిర్‌పాడ్స్‌ వంటి అన్ని లేటెస్ట్‌ యాపిల్‌ ఉత్పత్తుల పనితీరును కస్టమర్లు స్వయంగా తెలుసుకోవచ్చు. 
– యాపిల్‌ స్టోర్లలో సంప్రదాయ బిల్లింగ్‌ కౌంటర్లు, క్యూలు ఉండవు. సిబ్బంది దగ్గరే హ్యాండ్‌హెల్డ్‌ డివైస్‌లు ఉంటాయి. కస్టమర్‌ వద్దకే వచ్చి వారు అక్కడికక్కడే బిల్లింగ్‌ పూర్తి చేస్తారు. 
– కస్టమర్ల కోసం ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, మ్యూజిక్‌ క్రియేషన్, కోడింగ్, ఆర్ట్‌ వంటి అంశాలపై యాపిల్‌ నిపుణులు ఉచితంగా శిక్షణ ఇస్తారు. 
– యాపిల్‌ పరికరాల్లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సమస్యలు వస్తే పరిష్కరించడానికి జీనియస్‌ బార్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ డెస్క్‌ ఉంటుంది. డివైస్‌ సెటప్, యాపిల్‌ ఐడీ రికవరీ, బ్యాకప్‌ వంటి సహాయాన్ని నిపుణులు అందిస్తారు. 
– స్టోర్లలోని ఉద్యోగులు వివిధ రాష్ట్రాలకు చెందినవారై ఉంటారు. వారు తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ సహా 15కుపైగా భాషల్లో కస్టమర్లతో మాట్లాడి సహాయం అందిస్తారు. 
– వినియోగదారులు తమకు నచ్చిన ర్యామ్, స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్‌తో ఆన్‌లైన్‌లో డివైస్‌లు ఆర్డర్‌ చేసి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ నుంచి వాటిని కలెక్ట్‌ చేసుకోవచ్చు. 
– పాత ఐఫోన్, ఇతర బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లను ఎక్ఛ్సేజ్‌ చేసుకొని కొత్త యాపిల్‌ ఉత్పత్తులను డిస్కౌంట్‌పై పొందొచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement