పోషకాల ఆపిల్‌ బేర్‌.. ప్రోటీన్లు, విటమిన్లు ఇంకా మరెన్నో! కిలో ధర ఎంత? | Apple Ber Health Benefits Cultivation Income 1 Acre Profit And Prices | Sakshi
Sakshi News home page

పోషకాల ఆపిల్‌ బేర్‌, రైతుకు లాభాలు ఫుల్‌! ఎకరా సాగు చేస్తే భారీ ఆదాయం.. కిలో ధర ఎంతంటే?

Jan 9 2023 7:50 PM | Updated on Jan 9 2023 8:57 PM

Apple Ber Health Benefits Cultivation Income 1 Acre Profit And Prices - Sakshi

ఆయన మాత్రం ఈ రెండింటినీ సాగు చేసాడు. ప్రస్తుతం మూడో ఏడాది పంట. ఒక్కో చెట్టుకు 75 కిలోలకు తక్కువ కాకుండా ఆపిల్‌ బేర్‌ కాయలు వస్తున్నాయి. అన్ని చెట్లకు కలిపి దాదాపు

జగిత్యాల అగ్రికల్చర్‌: సంప్రదాయ పంటలకు భిన్నంగా వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేయడం ఆయనకు అలవాటు. అంతటితో ఆగకుండా పండ్లను విక్రయించేందుకు వినూత్న మార్కెటింగ్‌ శైలి అవలంబిస్తున్నాడు. దీనివల్ల ఏ పండునూ మార్కెట్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా వినియోగదారులే తోటల దగ్గరికి వచ్చి, కొనుగోలు చేస్తున్నారు. ఆ రైతే జగిత్యాల రూరల్‌ మండలంలోని లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన ఎడ్మల మల్లారెడ్డి (99598 68192).

కాయల సైజు 80 నుంచి 200 గ్రాములు
వర్షాధార పంట, ఒకప్పుడు బీడు భూముల్లో పెరిగి, ముళ్లు ఉండే రేగు జాతికి చెందిన చెట్టు ఆపిల్‌ బేర్‌. కాయల సైజు 80 నుంచి 200 గ్రాముల వరకు ఉంటుంది. ఆపిల్‌ బేర్‌లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్లు తదితర పోషకాలుంటాయి. ధరలు సైతం సామాన్యులకు అందుబాటులో ఉండటంతో మార్కెట్లో డిమాండ్‌ ఎక్కువుంది. ఆపిల్‌ బేర్‌ను ఎక్కువగా పశ్చిమబెంగాల్‌లో సాగు చేస్తారు. గత రెండు, మూడేళ్లుగా కాయలను ఇక్కడికి తీసుకువచ్చి, కిలో రూ.80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. కొందరు అభ్యుదయ రైతులు అక్కడక్కడా మన ప్రాంతంలోనూ సాగు చేస్తున్నారు. 

కోల్‌కతా నుంచి మొక్కలు తెప్పించిన రైతు
లక్ష్మీపూర్‌ రైతు మల్లారెడ్డి ఎకరం విస్తీర్ణంలో ఆపిల్‌ బేర్‌ సాగు చేస్తున్నాడు. కోల్‌కతా నుంచి మొక్కకు రూ.50 చొప్పున చెల్లించి, తెప్పించాడు. భూమిని రెండు, మూడుసార్లు దున్నించి, కొంత పశువుల ఎ రువు వేసి, చిన్నపాటి గుంతలు తీసి, దాదాపు 150 మొక్కలను నాటాడు. ఏడాది వరకు వాటి కొమ్మలు పక్కకు వెళ్లకుండా, కలుపు మొక్కలు లేకుండా చూ సుకుంటూ, అవసరమైనప్పుడు నీరందించాడు.

నాలుగు రకాలు..
ఆపిల్‌ బేర్‌లో గ్రీన్, రెడ్, హనీ, సుందరి అనే నాలుగు రకాలుంటాయి. మన నేలలు గ్రీన్, రెడ్‌ ఆపిల్‌ బేర్‌లకు అనుకూలం. వ్యాపారులు కోల్‌కతా నుంచి గ్రీన్‌ బేర్‌ను తీసుకువచ్చి, విక్రయిస్తున్నారు. మల్లారెడ్డి మాత్రం ఈ రెండింటినీ సాగు చేసాడు. ప్రస్తుతం మూడో ఏడాది పంట. ఒక్కో చెట్టుకు 75 కిలోలకు తక్కువ కాకుండా ఆపిల్‌ బేర్‌ కాయలు వస్తున్నాయి. అన్ని చెట్లకు కలిపి దాదాపు 2 టన్నుల వరకు దిగుబడి వస్తోందని ఆయన తెలిపాడు. 



దీపావళికి పూత.. సంక్రాంతికి కాత
ఆపిల్‌ బేర్‌ పూత దీపావళి(నవంబర్‌) సమయంలో ప్రారంభమవుతుంది. సంక్రాంతి(జనవరి) వరకు కాయలు కాస్తాయి. కాత పూర్తవగానే మల్లారెడ్డి మొ క్కలను కత్తిరిస్తుంటాడు. కొన్నిసార్లు కత్తిరించకుండా, గొర్రెలు పెంచుతూ, వాటికి పశుగ్రాసంగా వా డుతున్నాడు. ఈ పంటకు పెద్దగా ఎరువులు వేయ డు. వేసవిలో ఒక్కటి, రెండు నీటి తడులిస్తే సరిపోతుంది.  

కిలో రూ.50లకే విక్రయం
మల్లారెడ్డి తోట వద్దే కిలో ఆపిల్‌ బేర్‌ను రూ.50లకే విక్రయిస్తున్నాడు. అవి తాజాగా ఉండటం, ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకపోవడం, నచ్చిన చెట్టు వద్దకు వెళ్లి కాయలు తెంపుకోనిస్తుండటంతో వినియోగదారులు కొనుగోలు ఆసక్తి చూపుతున్నారు. ఇతన రైతులకు ఆపిల్‌ బేర్‌ సాగుకు అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఇస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement