భద్రతా సలహాదారు శివధర్‌రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, మల్కాజ్‌గిరి సీపీ బి.సుమతి, డీసీ ఆపరేషన్స్ అనిల్ కుమార్‌ను సత్కరిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రూపు రేఖలు మార్చడమే మా లక్ష్యం
నిర్దేశిత లక్ష్యంలోగా మావోయిస్టులను నిర్మూలించాం
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడి
యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్‌లో పాల్గొన్న అధికారులకు సత్కారం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/సాక్షి, హైదరాబాద్: రాబోయే ఐదేళ్లలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల రూపురేఖలు మార్చడం తమ తదుపరి లక్ష్యమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. నిర్దేశిత లక్ష్యం 2026 మార్చి 31లోగా దేశంలో మావోయిస్టులను నిర్మూలించడంలో కృషి చేసిన పోలీసులు, భద్రతా బలగాలను సోమవారం జగదల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు. దీంతోపాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన సేవా కేంద్రాలను నేతనార్ గ్రామంలో అమిత్ షా ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తమ దగ్గర అభివృద్ధి జరగకపోవడం వల్లే ఆయుధాలు చేపట్టామనే తప్పుడు ప్రచారం చేస్తూ మావోయిస్టులు బస్తర్ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఇటీవల మూడు వేల మంది మావోయిస్టులు లొంగిపోతే, అందులో రెండు వేల మందికి కనీసం రాయడం, చదవడం రాదని, ఈ ప్రాంతానికి మావోయిస్టులు చేసిన అన్యాయాలకు ఇదో ఉదాహరణ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేసిన కృషితో ఈ ప్రాంతం నుంచి మావోయిస్టులను నిర్మూలించామని పేర్కొన్నారు.
15 శాతం బస్తర్ ఆదివాసీల కోసం...
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సూచనలతో బస్తర్‌లో గుజరాత్ తరహాలో పాడి పరిశ్రమ అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించిందని అమిత్ షా చెప్పారు. ఇకపై వచ్చే ఉద్యోగాల భర్తీ ప్రకటనల్లో 15 శాతం ఉద్యోగాలను బస్తర్ ఆదివాసీల కోసం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టులను నిర్మూలించేందుకు 2018 నుంచి విస్త్రృత ప్రయత్నాలు జరిగాయని అమిత్‌షా అన్నారు.
ఢిల్లీలో పెద్ద పెద్ద భవనాల్లో కూర్చుని కాగితాలు, కంప్యూటర్ల మీద ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31వ తేదీని గడువుగా పెట్టుకున్నామని అమిత్ షా గుర్తుచేశారు. పై స్థాయిలో ఎన్ని ప్లాన్లు వేసినా వాటి క్షేత్రస్థాయిలో ఎలా అమలు చేస్తారనేది కీలకమని, ఆ విషయంలో వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు, పారా మిలిటరీ బలగాలు, స్పెషల్ ఫోర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేశాయని కితాబునిచ్చారు. ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న బలగాలకు ఆయన అభినందనలు తెలిపారు.
తెలంగాణకు అభినందనలు
బస్తర్‌లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి దిశానిర్దేశం చేసే నేతల్లో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారున్నారు. దీంతో నిర్దేశిత గడువులోగా మావోయిస్టులను నిర్మూలించడంలో తెలంగాణ పోలీస్ అధికారులు కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో జగదల్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ భద్రతా సలహాదారు శివధర్‌రెడ్డి (మాజీ డీజీపీ), తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, మల్కాజ్‌గిరి సీపీ బి.సుమతి (ఎస్‌ఐబీ మాజీ చీఫ్), డీజీపీ ఆపరేషన్స్ (ఆక్టోపస్, గ్రేహౌండ్స్) అనిల్ కుమార్‌ను అమిత్‌షా సత్కరించారు. మావోయిస్టు కార్యకలాపాల నిరోధానికి శివధర్‌రెడ్డి విశేష కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయ్, హోంమంత్రి విజయ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


