దశావతారాల్లో అమితాభ బుద్ధుడు

Alampur Temple Amitabha Buddha In Dashavatara - Sakshi

దశావతారాల్లో అమితాభ బుద్ధుడు

అలంపూర్‌ దేవాలయాల్లో వెలుగులోకి

సాక్షి, హైదరాబాద్‌: దశావతారాల్లో అమితాభ బుద్ధుడి విగ్రహాన్ని వెయ్యేళ్ల కిందే ఓ దేవాలయంలో చెక్కిన తీరు అబ్బురపరుస్తోంది. బౌద్ధం జాడలు అరుదుగా కనిపించే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో, సరిగ్గా బుద్ధుడి 2,566 జయంతి సమయంలో కొంత లోతైన పరిశోధనా వివరాలు వెలుగుచూశాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అలం పురంలోని పాపనాశేశ్వర, సూర్యనారాయణ ఆలయాల్లో బుద్ధుడి జాడలపై తాజాగా చరిత్ర పరిశోధకులు, ప్లీచ్‌ ఇండియా సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి పరిశోధించారు.

ఈ దేవాలయాల్లో బుద్ధుడి జాడలపై గతంలో ప్రముఖ చరిత్ర పరిశోధకులు బీఎస్‌ఎల్‌ హనుమంతరావు పరిశీలించి వెలుగులోకి తెచ్చారు. ఆదివారం శివనాగిరెడ్డి వాటిని పరిశీలించి లోతుగా విశ్లేషించారు. పద్మాస నంలో, ధ్యానముద్రలో మహాపురుష లక్షణాలతో ఉన్న మూడడుగుల ఎత్తు, అంతే వెడల్పు, నాలుగు అంగుళాల మందంతో అర్ధ శిల్పరీతిలో చెక్కిన ఈ బుద్ధుడి శిల్పాలు చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

సూర్యనారాయణ ఆలయ రంగ మండపం కప్పు మీద విష్ణు దశావతారాల్లో భాగంగా చెక్కిన బుద్ధుడు, బోధివృక్షం కింద పద్మాసనంలో ధ్యానముద్రలో ఉండగా, పైన వింజామరతో విద్యాధరుడు ఉన్నట్టు కనిపిస్తోంది. అలంపురం ఊరి వెలుపల పునర్నిర్మించిన పాపనాశేశ్వరాలయ మహామండపం కప్పు మీద ఇదే నేపథ్యంలో ఉన్న బుద్ధుడి కుడి పక్కన బోధివృక్షం, ఎడమ పక్కన ఒక స్త్రీ శిల్పాలున్నాయి. వజ్రాయాన బౌద్ధంలో ఇలాంటి ప్రతిమా లక్షణం కలిగిన బుద్ధుడి రూపాన్ని అమితాభ బుద్ధుడిగా పేర్కొంటారు. ఈ విగ్రహాలపై పరిశోధన అవసరమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top