breaking news
alampur temple
-
దశావతారాల్లో అమితాభ బుద్ధుడు
సాక్షి, హైదరాబాద్: దశావతారాల్లో అమితాభ బుద్ధుడి విగ్రహాన్ని వెయ్యేళ్ల కిందే ఓ దేవాలయంలో చెక్కిన తీరు అబ్బురపరుస్తోంది. బౌద్ధం జాడలు అరుదుగా కనిపించే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో, సరిగ్గా బుద్ధుడి 2,566 జయంతి సమయంలో కొంత లోతైన పరిశోధనా వివరాలు వెలుగుచూశాయి. జోగుళాంబ గద్వాల జిల్లా అలం పురంలోని పాపనాశేశ్వర, సూర్యనారాయణ ఆలయాల్లో బుద్ధుడి జాడలపై తాజాగా చరిత్ర పరిశోధకులు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి పరిశోధించారు. ఈ దేవాలయాల్లో బుద్ధుడి జాడలపై గతంలో ప్రముఖ చరిత్ర పరిశోధకులు బీఎస్ఎల్ హనుమంతరావు పరిశీలించి వెలుగులోకి తెచ్చారు. ఆదివారం శివనాగిరెడ్డి వాటిని పరిశీలించి లోతుగా విశ్లేషించారు. పద్మాస నంలో, ధ్యానముద్రలో మహాపురుష లక్షణాలతో ఉన్న మూడడుగుల ఎత్తు, అంతే వెడల్పు, నాలుగు అంగుళాల మందంతో అర్ధ శిల్పరీతిలో చెక్కిన ఈ బుద్ధుడి శిల్పాలు చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. సూర్యనారాయణ ఆలయ రంగ మండపం కప్పు మీద విష్ణు దశావతారాల్లో భాగంగా చెక్కిన బుద్ధుడు, బోధివృక్షం కింద పద్మాసనంలో ధ్యానముద్రలో ఉండగా, పైన వింజామరతో విద్యాధరుడు ఉన్నట్టు కనిపిస్తోంది. అలంపురం ఊరి వెలుపల పునర్నిర్మించిన పాపనాశేశ్వరాలయ మహామండపం కప్పు మీద ఇదే నేపథ్యంలో ఉన్న బుద్ధుడి కుడి పక్కన బోధివృక్షం, ఎడమ పక్కన ఒక స్త్రీ శిల్పాలున్నాయి. వజ్రాయాన బౌద్ధంలో ఇలాంటి ప్రతిమా లక్షణం కలిగిన బుద్ధుడి రూపాన్ని అమితాభ బుద్ధుడిగా పేర్కొంటారు. ఈ విగ్రహాలపై పరిశోధన అవసరమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. -
అలంపూర్ అభివృద్ధికి మంత్రి హామీ
అలంపూర్: తెలంగాణలోని శక్తి పీఠం అలంపూర్ ఆలయాల అభివృద్ధికి మంత్రి కేటీఆర్ నుండి హామీ లభించిందని దేవస్థాన చైర్మన్ లక్ష్మినారాయణరెడ్డి, ఈవో గురురాజలు తెలిపారు. ఈ మేరకు వారు మంగళవారం కార్యాలయ చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రిని ఆహ్వానించేందుకు వెళ్లగా అలంపూర్ ఆలయాలను యాదగిరి, వేములవాడ తరహాలో అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. అయితే ఒకదాని తరువాత ఒకటి అభివృద్ది జరుగుతుందని అంతవరకు కొంత సంయమనం పాటించాల్సిందిగా కోరినట్టు తెలిపారు. కేటీఆర్ ను కలసిన వారిలో దేవస్థాన ఈవో నరహరి గురురాజ, దర్మకర్తలు, అర్చకులు తదితరులు ఉన్నారు.