
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన తల్లీ కొడుకు
అతి చిన్న వయసులో హైదరాబాదీ అద్భుత సాహసం
కాచిగూడ: హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలిచే విధంగా నగరానికి చెందిన తల్లీ కొడుకులు హిమలయ పర్వతాల మధ్యలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు విజయవంతంగా ట్రెక్కింగ్ పూర్తి చేశారు. ఈ యాత్రలో తల్లీ కొడుకులిద్దరూ చూపిన పట్టుదల, దైర్య, సాహసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. జేపీ మెర్గాన్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రవ్వ శరణ్య (39), బాచుపల్లిలోని కెన్నెడీ గ్లోబల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఆమె కుమారుడు మకం శ్రేయాన్షు (12) అక్టోబర్ 5, 2025న ఈ సహస యాత్రను ప్రారంభించారు.
దాదాపు రెండు వారాల పాటు మంచు పర్వతాలపై కఠిన వాతావరణ పరిస్థితులు, తక్కువ ఆక్సిజన్‌తో కూడిన మార్గాలను అధిగమించి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు. శనివారం వారు సురక్షితంగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా శరణ్య తన అనుభవాన్ని పంచుకుంటూ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని చెప్పారు.
ప్రత్యేక శిక్షణ..
శేయాన్షు తల్లిదండ్రులు గోవర్థన్–శరణ్య. యాత్రకు ముందు శ్రేయాన్షు ప్రత్యేక శారీరక దారుఢ్యంలోనూ, ట్రెక్కింగ్‌లోనూ శిక్షణ పొందాడు. పాఠశాల అధ్యాపకులతో పాటు పలువురు ప్రముఖులు, సహ విద్యార్థులు, తోటి సహచరులు తల్లీ కొడుకులిద్దరినీ అభినందించారు. ఇది కేవలం సాహసయాత్ర మాత్రమే కాదు, ‘ధైర్యం, పట్టుదల, కుటుంబ బంధం’ అనే విలువలకు ప్రతీకంగా నిలుస్తుంది. తల్లి, బిడ్డ కలిసి సాధించిన ఈ విజయం తెలంగాణకు గర్వకారణమని పలువురు కొనియాడారు. వయస్సు, వృత్తి, పరిస్థితులు కాదు.. మన సంకల్పమే పర్వతాలను అధిరోహించే శక్తినిస్తుందని చెబుతున్నారు యాత్రికులు.
అంతసులభం కాదు..
చలిని తట్టుకోవడం అంత సులభం కాదు.. అదే విధంగా సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న శిఖరాన్ని చేరుకునే సమయంలో శ్వాస ఆడకపోవడం లాంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎంతో దృఢ సంకల్పంతో, పట్టు వీడకుండా తొలి ప్రయత్నంలోనే ఎవరెస్ట్ ఎక్కాలన్న లక్ష్యాన్ని చేరుకున్నాం.. ‘ఇది కేవలం శారీరక పరీక్ష మాత్రమే కాదు, మానసిక స్థైర్యం, పట్టుదల, ఈ యాత్రతో నా కుమారుడితో అద్భుతమైన బంధం ఏర్పడింది.’ ప్రతి అడుగు మా సంకల్పాన్ని మరింత దృఢం చేసింది. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను నా కుమారుడితో కలిసి అధిరోహించడం మాకు జీవితాతంతం గుర్తుండిపోయే గొప్ప యాత్ర. –రవ్వ శరణ్య
క్లిష్టమైన ప్రయాణం..
ఇది చాలా క్లిష్టమైన ప్రయాణం. అయినప్పటికీ ప్రతి రోజూ కొత్త పాఠాలు నేర్పింది. ధైర్యం, క్రమశిక్షణ, కష్టాన్ని తట్టుకునే శక్తి అవసరాన్ని ఈ యాత్రలో తెలుసుకున్నా. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నా కల. హైదరాబాద్‌లోనే అని చిన్న వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్ పూర్తి చేసిన పిల్లల్లో నేను ఒకడిని. – శ్రేయాన్షు