‘దిశ’ కేసులో వాయిదాలు సరికాదు

Adjournments are not correct in the Disha case  - Sakshi

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం 

నిందితుల ఎన్‌కౌంటర్‌ను సవాల్‌ చేస్తూ  దాఖలైన పిటిషన్‌పై విచారణ 

ఏప్రిల్‌ 12కు వాయిదా వేసిన ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన ‘దిశ’హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాయిదాలు కోరడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాదనలను వినిపించకుండా తప్పించుకుంటున్నట్లు కనిపిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది.

రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది వాదిస్తారని, అత్యున్నత న్యాయస్థానంలో వ్యాజ్యాలకు హాజరుకావడంలో ఆయన చాలా బిజీగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ ఉండగా, ఢిల్లీ నుంచి న్యాయవాదులు ఎందుకు అని కోర్టు వ్యాఖ్యానించింది. ఏదేమైనా చివరి వాదనలను ఏప్రిల్‌ 12కు వాయిదా వేస్తున్నామని, ఆ రోజు నేరుగా లేదా ఆన్‌లైన్‌ ద్వారా అయినా వాదనలు వినిపించాలని సీజే ధర్మాసనం ఆదేశించింది.  

పోలీసులపైనే హత్య కేసు పెడితే ఎలా అన్న సీనియర్‌ న్యాయవాది  
– 2019, డిసెంబర్‌ 6న ‘దిశ’కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌ను సవాల్‌ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాం జీ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ‘దిశ’కేసు అత్యాచారం, హత్య కేసులో దర్యాప్తు అధికారి తరఫున సీనియర్‌ న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు.

పోలీసులపైనే హత్య కేసు పెడితే పోలీసు అధికారి జీవించే హక్కుకు భంగం కలిగినట్టే అవుతుందన్నారు. ఆర్టీకల్‌ 21 కింద నిర్దేశించిన జీవించే హక్కు ప్రమాదంలో ఉన్నప్పుడు పౌరులు హైకోర్టుకు వస్తారని.. కానీ, కమిషన్‌ నివేదిక ఆధారంగా కేసు నమోదుకు హైకోర్టు ఆదేశిస్తే, పోలీసు అధికారులు ఎక్కడికి వెళ్లగలరని ప్రశ్నించారు.

‘దిశ’తండ్రి తరఫున కె.వివేక్‌రెడ్డి వాదిస్తూ.. 2012లో ఏపీ హైకోర్టులోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం హత్యల ఘటనల్లో పోలీసులు తగిన విధానాన్ని అనుసరించాలని స్పష్టంగా పేర్కొందన్నారు. కమిషన్‌ నివేదికను పరిగణనలోకి తీసుకునే ముందు విధివిధానాలను అనుసరించాలన్నారు. నిందితుల హత్యలను ‘దిశ’తండ్రి సమర్థిస్తున్నారా అని ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top