రాష్ట్రంలో ఏటా కేన్సర్ బారిన పడుతున్న వారు 55 వేలపైనే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేన్సర్ వ్యాధి అంతకంతకూ విస్తరిస్తోంది. ఏటా 55 వేల మందికిపైగా కేన్సర్ బారిన పడుతున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైన కేసులతోపాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్న చికిత్సల గణాంకాలతో వెల్లడవుతోంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా కేన్సర్ రోగుల లెక్కలను సేకరించడంలేదు. నిబంధనల ప్రకారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదీనంలోని ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సరై్వలెన్స్ పోర్టల్ (ఐడీఎస్‌పీ)లో దేశవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు, ప్రమాదకర రోగాలకు సంబంధించిన సమాచారాన్ని చేర్చాలి. తద్వారా ఆయా వ్యాధుల నివారణ, ముందు జాగ్రత్తలపై కేంద్రం నిఘా ఉంటుంది. ఆయా వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు, ఎక్కడెక్కడ ప్రబలుతున్నాయనే అంశాలపై కేంద్రానికి పరిశోధనలు జరిపే అవకాశం లభిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా కేవలం అంచనాలకే పరిమితమవుతోంది.
ఐడీఎస్‌పీలో నిరంతర పర్యవేక్షణ
సీజనల్ వ్యాధులతోపాటు తాగునీరు, ఆహారం, దోమలు, ఇతర రోగాలకు సంబంధించిన గణాంకాలను ఐడీఎస్‌పీ ద్వారా కేంద్ర ప్రభుత్వం 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించి ఆయా రోగాలపై నిరంతర నిఘా పెడుతుంది. డయేరియా, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్, కలరా, వంటి 12 రోగాలపై ‘ఎల్’కేటగిరీలో నిఘా కొనసాగిస్తుంది. వాటితోపాటు కుక్క కాటు, పాముకాటు, చికెన్‌పాక్స్, మీజిల్స్, ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సోకే వ్యాధులు, ఇతర గుర్తించని రోగాలకు సంబంధించి ‘ప్రిసంప్టివ్’విభాగంలో నమోదు చేసి ముందు జాగ్రత్త చర్యలు, పరిశోధనలు జరుపుతుంది. అలాగే సంబంధిత రాష్ట్రాలకు అవసరమైన మందులు, ఇతర సహకారాన్ని కూడా అందిస్తుంది.
మంత్రి చెప్పినా పడని ముందడుగు ..
రాష్ట్రంలో ఏటా 55 వేలకుపైగా కేన్సర్ కేసులు కొత్తగా నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రతి జిల్లాకు ఓ కేన్సర్ డే కేర్ సెంటర్ (సీడీసీ)ను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా ఆస్పత్రుల్లో కేన్సర్ స్క్రీనింగ్‌తోపాటు కీమోథెరపీ చికిత్స కూడా అందిస్తున్నారు. త్వరలో రీజనల్ కేన్సర్ సెంటర్లను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో కేన్సర్ చికిత్స అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.
లంగ్, బ్రెస్ట్, సరై్వకల్ కేన్సర్‌లే ఎక్కువగా రాష్ట్రంలో నమోదవుతున్న నేపథ్యంలో ఈ వ్యాధులకు తొలిదశ నుంచే చికిత్స అందించడం ద్వారా కేన్సర్ మరణాలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదయ్యే కేన్సర్ కేసులను ప్రతి వారం ఐడీఎస్‌పీలో నమోదు చేయాలని మంత్రి దామోదర గతంలో తన శాఖ సమీక్షలో ఉన్నతాధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి ముందడుగు లేదు.


