
ముచ్చర్లలో అన్యదేశ జంతు ప్రదర్శనశాల
సింగపూర్ తరహాలో రూపుదిద్దే యోచన
ఇప్పటికే స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
పీపీపీ విధానంలో పనులు ప్రారంభించనున్న టీఎఫ్‌డీసీ..
మరో రెండేళ్లలో అందుబాటులోకి..
విదేశీ జంతు జాతులను కనులారా చూసి ఆనందించాలని ఉందా? వేరే దేశంలోనో, దూర ప్రాంతాలకు వెళ్లో ఈ వన్యప్రాణులను చూసి రావటం అసాధ్యమని భావిస్తున్నారా? అయితే.. మీరు ఏమాత్రం చింతించనవసరంలేదు. రెండేళ్లు ఆగితే మన వద్దే ఎగ్జోటిక్ జూ పార్కు (విదేశీ జంతు ప్రదర్శన శాల) అందుబాటులోకి వచ్చే అవకాశముంది. నగర శివారులోని ముచ్చర్లలో ఇది ఏర్పాటు కానుంది. 200 ఎకరాల్లో విదేశీ (అన్యజాతి) జంతు ప్రదర్శన శాల సందర్శకులకు కనువిందు చేయనుంది. సింగపూర్ జూ తరహాలో దీనిని రూపుదిద్దనున్నారు. పీపీపీ పద్ధతిలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో ఈ జూ పార్కును ఏర్పాటు చేయనున్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్ల గ్రామ శివారు అటవీ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం స్థలం కేటాయించింది. ప్రపంచంలోని ఇతర దేశాలకు చెందిన జంతువులను మాత్రమే ఇక్కడ ఉంచుతారు. ఇతర జూ పార్కులతో పాటు పెద్ద పెద్ద ఫామ్స్‌లలో పెంపకం చేపట్టే వారి వద్ద నుంచి వివిధ రకాల జంతువులను ఇక్కడికి తరలించి సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. రానున్న రెండేళ్లలో ఈ ఎగ్జోటిక్ యానిమల్ జూ పార్కు అందుబాటులోకి రానుంది.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలకు తోడు నాలుగో సిటీగా ఏర్పడనున్న ఫ్యూచర్ సిటీకి దగ్గరల్లో విదేశీ జంతు ప్రదర్శన శాల అందుబాటులోకి రానుంది. పాతబస్తీ చాంద్రాయణగుట్ట మీదుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు కారిడార్ ఎక్స్‌టెన్షన్ ఏర్పాటు కానున్న దృష్ట్యా కొత్తగా ఏర్పడనున్న ఈ జూ పార్కుకు రోడ్డు మార్గంతో పాటు మెట్రో రైలు సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్)తో పాటు రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) తదితర అత్యంత సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ఈ జూ పార్కుతో పాటు మరో 1,500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని జూ సఫారీ పార్కు ఏర్పాటు చేయడానికి అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం 380 ఎకరాల్లో 2,200 జంతువులతో కొనసాగుతున్న నెహ్రూ జూ పార్కుకు అదనంగా ఈ విదేశీ జంతు ప్రదర్శన శాల అందుబాటులోకి రానుంది.
ఏయే దేశాల నుంచి..
ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆ్రస్టేలియా దేశాలకు చెందిన జంతు జాతులను ఎగ్జోటిక్ యానిమల్ జూ పార్కుకు తరలించనున్నారు. నెహ్రూ జూ పార్కులోని జంతువులు అక్కడే ఉండనున్నాయి. ఒకవైళ ఇప్పటికే ఇక్కడ ఉన్న విదేశీ జంతువుల సంతానం పెరిగితే వాటిని మాత్రమే అక్కడికి తరలించనున్నారు. జంతు మార్పిడిలో భాగంగా ఇతర దేశాల్లోని జూ పార్కుల నుంచి అవసరమైన జంతు జాతులను కొత్త జూ పార్కుకు తరలించనున్నారు. అలాగే.. ప్రైవేట్ యాజమాన్యాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫామ్స్ నుంచి జంతువులను ఖరీదు చేసి ఇక్కడికి తీసుకురానున్నారు. నెహ్రూ జూ పార్కులో కొనసాగుతున్న ప్రస్తుత జంతు సేకరణకు భిన్నంగా ఈ ప్రక్రియ కొనసాగనుంది.
దేశంలోనే అతిపెద్దగా..
200 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఎగ్జోటిక్ యానిమల్ జూ పార్కు దేశంలో అతి పెద్దది కానుందని జూ పార్కు అధికారులు తెలిపారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని శ్రీ చామరాజేంద్ర జంతు ప్రదర్శన శాల (మైసూర్ జూ)లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాల జంతువులకు ఆవాసంగా కొనసాగుతోంది. అంతరించిపోతున్న జంతు జాతుల పరిరక్షణ జరుగుతోంది. దీనికి తోడు ఆదాయంతో పాటు సందర్శకులకు వినోదం లభిస్తోంది. ఈ తరహాలోనే నగర శివారు ముచ్చర్లలో విదేశీ జంతు ప్రదర్శన శాల ఏర్పాటు కానుంది. అయితే ముచ్చర్ల జూ పార్కు మైసూర్ జూ పార్కు కన్నా.. విశాలంగా ఏర్పాటు కానుంది.
పనులు చకచకా..
విదేశీ జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. ముచ్చర్లలో ఈ జూ పార్కు రూపుదిద్దుకోనుంది. దీంతో పాటు అక్కడే దాదాపు 1,500 ఎకరాల అటవీ స్థలాన్ని సైతం సఫారీ పార్కుకు కోసం పరిశీలిస్తున్నాం. రానున్న రెండేళ్లలో కొత్త జూ పార్కు సందర్శకులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
– డాక్టర్ సునీల్ ఎస్.హీరేమత్, డైరెక్టర్, తెలంగాణ జూ పార్క్స్.