కర్ణాటక సరిహద్దులో.. 2 బ్రిడ్జి కమ్‌ బరాజ్‌లు! | 2 Bridge-cum-Barrages in Karnataka border | Sakshi
Sakshi News home page

కర్ణాటక సరిహద్దులో.. 2 బ్రిడ్జి కమ్‌ బరాజ్‌లు!

May 26 2026 5:35 AM | Updated on May 26 2026 5:35 AM

2 Bridge-cum-Barrages in Karnataka border

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. చిత్రంలో కర్ణాటక మంత్రి బోసురాజు, మంత్రి వాకిటి శ్రీహరి

కృష్ణాపై కొల్పూర్, కొర్తుకుండ వద్ద 1.08 టీఎంసీలతో ఒకటి  

భీమాపై తంగడగి వద్ద 1 టీఎంసీతో మరొకటి 

ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాల మధ్య సంప్రదింపులు ప్రారంభం 

మంత్రి ఉత్తమ్‌ నేతృత్వంలో సచివాలయంలో చర్చలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో రెండు బ్రిడ్జి కమ్‌ బరాజ్‌లను సంయుక్తంగా నిర్మించాలనే ప్రతిపాదనలపై ఉభయ రాష్ట్రాల మధ్య సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. కొల్పూర్, కొర్తుకుండ వద్ద కృష్ణా నదిపై 1.08 టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్రిడ్జి కమ్‌ బరాజ్‌.. తంగడగి గ్రామం వద్ద భీమా నదిపై 1 టీఎంసీ సామర్థ్యంతో మరో బ్రిడ్జి కమ్‌ బరాజ్‌ నిర్మించాలనే ప్రతిపాదనలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో రెండు రాష్ట్రాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. 

జూరాల ప్రాజెక్టుకు సుమారు 30 కి.మీ.ల ఎగువన కొల్పూర్, కొర్తుకుండ వద్ద ఒక బరాజ్, కృష్ణా ప్రధాన పాయలో భీమా నది కలిసే ప్రాంతానికి ఎగువన తంగడగి వద్ద మరో బరాజ్‌ నిర్మించాలనే ప్రతిపాదనలపై కర్ణాటక అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ బరాజ్‌ల నిర్మాణంతో రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందని కర్ణాటక మంత్రి చెప్పారు. బరాజ్‌ల కుడి వైపు నుంచి కర్ణాటక, ఎడమ వైపు నుంచి తెలంగాణ.. నీళ్లను మళ్లించుకోవచ్చని, వేసవిలో తాగునీటి అవసరాల కోసం పంపింగ్‌ చేసుకోవచ్చని సూచించారు. 

అయితే ఈ సమావేశంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ప్రజా ప్రతినిధుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో సమగ్ర అధ్యయనం కోసం నీటిపారుదల శాఖ కార్యదర్శి, ఈఎన్‌సీ (జనరల్‌), ఇతర నిపుణులతో ఒక కమిటీ వేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకుంటామని, ఈ మేరకు ఒప్పందం చేసుకుంటామని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రతిపాదనలను కర్ణాటక మంత్రికి వివరించామని ఉత్తమ్‌ మీడియాకు తెలిపారు. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే ప్రతిపాదనలను ఆ రాష్ట్రం ముందు ఉంచినట్టు వెల్లడించారు. ఈ చర్చల్లో సాధించిన పురోగతిని సీఎం రేవంత్‌రెడ్డికి వివరించి నిర్ణయం తీసుకుంటామన్నారు.  

మంత్రుల మధ్య భిన్నాభిప్రాయం 
కృష్ణా, భీమా నదులపై బరాజ్‌లు నిర్మిస్తే దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు వరదలు లేనప్పుడు వచ్చే రీజనరేటెడ్‌ నీళ్ల ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రధానంగా బీమా నదిపై ఇప్పటికే కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులు నిర్మించడంతో జూరాల ప్రాజెక్టుకు వరద తగ్గిపోయిందని ఆయన అన్నారు. కృష్ణా, భీమా నదులపై ఎగువన కర్ణాటకలో ఇప్పటికే కట్టిన ప్రాజెక్టులతో వర్షాభావ సంవత్సరాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ జి.చిన్నారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 

మరోవైపు కరువు పీడిత మక్తల్‌ నియోజకవర్గానికి తాగు, సాగునీటి సరఫరా కోసం ఈ రెండు బరాజ్‌లను నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. కర్ణాటకలోని ఆల్మట్టి బరాజ్‌ ఎత్తు పెంచడానికి ఆ రాష్ట్రం తీసుకుంటున్న చర్యలతో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు పలువురు కర్ణాటక మంత్రిని నిలదీసినట్టు తెలిసింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రైతాంగానికి కీలకమైన ఆర్డీఎస్‌ ఆధునికీకరణ ప్రాజెక్టుకు కర్ణాటక సహకరించడం లేదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయగా, ఈ విషయంలో ఏపీ సహకరించడం లేదని కర్ణాటక మంత్రి బదులిచ్చారు. 

ప్రాజెక్టు పనులకు అవసరమైన నిధులు విడుదల చేస్తే సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో రాయచూర్‌ ఎంపీ జి.కుమార్‌నాయక్, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, రాయచూర్‌ రూరల్‌ ఎమ్మెల్యే బసన్నగౌడ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మేఘారెడ్డి, శివకుమార్‌రెడ్డి, వంశీకృష్ణ, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement