
వనపర్తి జిల్లా: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్తగారింటికి మొదటి సారి వచ్చిన అల్లుడికి మరిచిపోని ఆతిథ్యాన్ని ఇచ్చారు అత్తామామలు. ఒకట్రెండు కాదు.. ఏకంగా 150 రకాల తెలంగాణ వంటకాలను సిద్ధం చేయడంతో అల్లుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం రేమద్దుల గ్రామానికి చెందిన జాజాల తిరుపతయ్య, రేణుక దంపతుల కూతరు శిరీషను అదే గ్రామానికి చెందిన మహంకాళి రాముడు కుమారుడు మహంకాళి మహేష్‌కు ఇచ్చి ఇటీవల వివాహం జరిపించారు.
ఈక్రమంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని అల్లుడు బుధవారం అత్తగారింటికి రాగా.. అతడికి 150 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. వేపుళ్లు, పచ్చళ్లు. చట్నీళ్లు, పప్పులు, స్నాక్స్, స్వీట్స్, మటన్, చికెన్, బిర్యానీలను చూసి అల్లుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. తనపై అభిమానంతో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని ఆరగించి అత్తామామల ఆశీర్వాదం తీసుకున్నారు.