గ్రాండ్‌ ట్రంక్‌ రూట్‌లో 120 కొత్త రైళ్లు! | 120 new trains on the Grand Trunk route | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌ ట్రంక్‌ రూట్‌లో 120 కొత్త రైళ్లు!

Apr 7 2026 4:32 AM | Updated on Apr 7 2026 4:32 AM

120 new trains on the Grand Trunk route

ఈఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో మూడో లైన్‌ అందుబాటులోకి

ఇప్పటికే 700 కి.మీ. మేర వాడకం మొదలు

దీంతో 36 ప్రయాణికుల రైళ్లు, 50 గూడ్సు రైళ్ల సంఖ్య పెంపు

మరో 38 కి.మీ.పూర్తయితే అదనంగా 50 రైళ్ల జోడింపు

గరిష్ట వేగంతో వందేభారత్‌ దూసుకెళ్లే్లలా ట్రాక్‌ బలోపేత పనులు

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ–ఉత్తర భారత్‌లను జోడించే ప్రధాన గ్రాండ్‌ ట్రంక్‌ కారిడార్‌ అయిన బల్లార్షా–విజయవాడ మార్గంలో 120కిపైగా కొత్త రైళ్లు పట్టాలెక్కేందుకు వెసులుబాటు కలిగింది. బల్లార్షా–కాజీపేట–విజయవాడ–గూడూరు మధ్య మూడో లైన్‌ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మరో 38 కి.మీ. నిడివిలో మాత్రమే పనులు మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అవి కూడా పూర్తయి మొత్తం కారిడార్‌ సిద్ధం కానుంది. 

ఇప్పటికే సిద్ధమైన 700 కి.మీ. మూడో లైన్‌ వినియోగంలోకి రావడంతో గత ఏడాది కాలంలో ప్రయాణికులకు విడతల వారీగా 36 కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 50 గూడ్సు రైళ్లు కూడా పట్టాలెక్కాయి. మిగతా పనులు పూర్తయితే మరో 50 రైళ్లు కొత్తగా పట్టాలెక్కించేందుకు రైల్వే బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. 

ఇక, ఆ కారిడార్‌ మొత్తాన్ని వందేభారత్‌ రైళ్లు గరిష్ట వేగంతో దూసుకుపోయేలా 130–150 కి.మీ. వేగాన్ని తట్టుకునే సామర్థ్యానికి ట్రాక్‌ను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మూడో లైన్, ట్రాక్‌ బలోపేతం పనుల్లో జాప్యం లేకుండా తాజాగా రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేకు భారీగానే నిధులు కేటాయించింది.

రూ.13,026 కోట్ల నిధులు...
ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు మౌలిక వసతుల మెరుగు కోసం రూ.13,026 కోట్లు కేటాయించింది. ఇది అంతకుముందు బడ్జెట్‌ కేటాయింపు రూ.11,012 కంటే 18% అధికం కావడం విశేషం. బడ్జెట్‌ సమయంలో ఈ వివరాలను వెల్లడించని రైల్వే అధికారులు తాజాగా ఆ అంకెలను విడుదల చేశారు. ఈ మొత్తం నుంచి కొత్త లైన్ల కోసం రూ.1,315 కోట్లు , డబ్లింగ్‌ కోసం రూ.5083 కోట్లు, ట్రాక్‌ పునరుద్ధరణ కోసం రూ.1,908 కోట్లు, ట్రాఫిక్‌ వసతుల అప్‌గ్రెడేషన్‌ కోసం రూ.403 కోట్లు, రోడ్డు భద్రతా పనుల కోసం రూ. 683 కోట్లు ప్రకటించారు. 

» గత ఏడాది కాలంలో జోన్‌ పరిధిలో కొత్తగా 194.57 కిలోమీటర్ల మేర ట్రాక్‌ ఏర్పాటు చేయగా, ఈ సారి ఆ నిడివి మరింత ఎక్కువ ఉండనుంది. 

»    బాసర–నవీపేట మధ్య 17 కి.మీ. మధ్య డబ్లింగ్‌ పూర్తి కాగా, కాజీపేట వద్ద బైపాస్‌ లైన్‌ (21.46 కి.మీ.), వాడి వద్ద బైపాస్‌ లైన్‌ (22.70 కి.మీ.) , తాండూరు వద్ద ‘వై’ఆకృతి బైపాస్‌ అనుసంధానం (1.95కి.మీ), పెద్దపల్లి వద్ద బైపాస్‌ లైన్‌ ( 2.17 కి.మీ).

»   బల్హార్షా –మాణిక్‌ఘర్‌ మ«ధ్య మూడో లైన్‌(6.91 కి.మీ.), రెచ్ని రోడ్‌ –బెల్లంపల్లి మధ్య( 9.636 కి.మీ.),  బెల్లంపల్లి–మందమర్రిమధ్య(7.52 కి.మీ.), మోట మర్రి– మధిర (5.80 కి.మీ.)మధ్య, మహబూబాబాద్‌ – నెక్కొండ (30.416 కి.మీ.) మధ్య, ఖమ్మం –డోర్నకల్‌ (19.59 కి.మీ.) మధ్య మూడో లైన్‌ పూర్తయింది. 

»   ఏడాది కాలంలో 325 కిలోమీటర్ల మేర ట్రాక్‌ విద్యు దీకరణ కూడా పూర్తయింది. గత రెండేళ్లలో పనుల్లో వేగం వల్ల గూడూరు –విజయవాడ– కాజీపేట– బల్హా ర్షా మధ్య 700 కి.మీ. మూడో లైన్‌ అందుబాటులోకి వచ్చింది. పెదవడ్లపూడి – కృష్ణా కెనాల్‌ మధ్య 7 కి.మీ., డోర్నకల్‌–మహబూబాబాద్‌ మధ్య 20 కి.మీ., సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–ఆసిఫాబాద్‌ మధ్య 11 కి.మీ. మేర పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కొత్త బడ్జెట్‌ నిధులు మెరుగ్గానే ఇవ్వడంతో ఈ పనులు ఈ ఏడాది చివరిలోపే పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరింత వేగంగా రైళ్లు...
వందేభారత్‌ రైలు 160 కి.మీ. వేగంతో దూసుకెళ్లే అవకాశం ఉన్నా, ట్రాక్‌ పటుత్వం తక్కువగా ఉండడంతో ప్రస్తుతం సగటు వేగం 90 కి.మీ.లోపే. దీంతో ట్రాక్‌ సామర్థ్యాన్ని 130–160 కి.మీ. వేగాన్ని తట్టుకునేలా పటిష్టపరచాల్సి ఉంది. కానీ, రెండు లైన్లు మాత్రమే ఉండి, నిరంతరం వచ్చిపోయే రైళ్లతో బిజీగా ఉండటంతో పనులు చేపట్టేందుకు వీలు కలగలేదు. ఇప్పుడు మూడో లైన్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుండడంతో, రైళ్లను రెండు లైన్లకు పరిమితం చేస్తూ మూడో లైన్‌ను పటిష్ట పరిచేందుకు వీలు కలగనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement