
మూసాపేట: కూకట్‌పల్లి దయార్‌గూడలో సోమవారం సహస్రిని (11) అనే బాలికను హత్య చేసిన కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఈమేరకు మంగళవారం ఎస్‌ఓటీ, సీసీఎస్, పోలీస్ బృందాలు సుమారు 6 టీములుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టాయి. సీసీ పుటేజ్, క్లూస్ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను విచారించారు. కాలనీలో, భవనంలోని పలువుర్ని ప్రశ్నించారు. బాలిక ఒంటిపై సుమారు 20కి పైగా చిన్న చిన్న గాట్లు ఉన్నాయని, పదునైన చిన్నపాటి ఆయుధంతో పొడిచి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
మెడపై 14 గాట్లు, కడుపులో 6 గాట్లు ఉన్నట్లు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి కాగానే మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లాలోని వారి సొంత గ్రామానికి తీసుకువెళ్లారు. ఇప్పటి వరకు బాలిక హత్య ఎవరు చేశారో, ఎందుకు చేశారో అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. కాగా అదే భవనంలో ఉన్న ఒడిశాకు చెందిన ఓ వ్యక్తిపై అనుమానాలున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కుటుంబంపై చేతబడి చేశారన్న అనుమానంతో అతడు అనుమానాస్పదంగా కన్పించడంతో పోలీసులు ఆ కోణంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
