
దేశంలో ఏటా ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న 1.2 కోట్ల మంది యువత
వారిలో 60 లక్షల మందిలోనే సరైన నైపుణ్యాలు
నిపుణులు దొరక్క ఇబ్బందిపడుతున్న 48% కంపెనీలు
ఏఐ–డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త రంగాల్లో లక్షలాదిగా ఖాళీలు
స్కిల్స్ లేక ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో 60% మందికి నో ప్లేస్‌మెంట్స్
78% మంది బీఏ, బీఎస్సీ డిగ్రీలు చేసిన వారిదీ అదే పరిస్థితి
నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ చేపట్టిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికలో వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగాలు లేవని ఓవైపు యువత ఆందోళన చెందుతుంటే మరోవైపు లక్షలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నా పట్టభద్రుల్లో తగిన స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు భర్తీ కావట్లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఏటా 1.2 కోట్ల మంది యువత ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నప్పటికీ వారిలో సుమారు 60 లక్షల మందికే సరైన నైపుణ్యాలు ఉంటున్నాయని కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ పరిధిలోని నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్‌ఎస్‌ఎస్) సంస్థ చేపట్టిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) నివేదిక తెలిపింది.
48% కంపెనీలు నైపుణ్యంగల ఉద్యోగులు లేక ఇబ్బంది పడుతున్నాయని పేర్కొంది. ఈ సర్వే ప్రకారం ప్రస్తుతం ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారిలో 60% మందికి ప్లేస్‌మెంట్స్ దొరకడం లేదు. 78% మంది బీఏ, బీఎస్సీ డిగ్రీలు పూర్తి చేసిన వారికి వెంటనే ఉపాధి లభించట్లేదు. నైపుణ్యాలు లేని కారణంగా కంపెనీలు ఉద్యోగాలను వేగంగా భర్తీ చేయలేక పోతున్నాయి. ఐటీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్ వంటి రంగాల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నైపుణ్యాల కొరత వల్ల వాటి భర్తీ ఆలస్యమవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు 2030లోగా 40 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ అవసరమని నివేదిక అభిప్రాయపడింది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 2023 వరకు కేవలం 1.38 కోట్ల మంది యువతకే శిక్షణ లభించిందని పేర్కొంది.
రంగాలవారీగా చూస్తే
⇒ ఏఐ–డేటా సైన్స్: 5 లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ 51% వరకు నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులు దొరకడం కష్టంగా మారింది.
⇒ లైఫ్ సైన్స్: 5 లక్షల ఉద్యోగాల్లో 51% సిబ్బందికి నైపుణ్యం సరిగ్గా లేదు.
⇒ సైబర్ సెక్యూరిటీ: 2.5 లక్షలకుపైగా ఖాళీలు ఉన్న ఈ రంగంలో 63% వరకు నైపుణ్యాల కొరత కనిపిస్తోంది.
⇒ క్లౌడ్ కంప్యూటింగ్: 2 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నా, 45% వరకు మిడ్‌లెవల్ టాలెంట్ కొరత ఉంది.
⇒ హెచ్‌ఆర్: 2.5 లక్షల ఉద్యోగాల్లో 63% మందికి నైపుణ్య సమస్య.
⇒ ఐటీ–కంప్యూటర్ సైన్స్: 2 లక్షల ఉద్యోగాల్లో 45% మందికి నైపుణ్యం తక్కువగా ఉంది.
⇒ సెమీకండక్టర్: 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 70% వరకు టెక్నికల్ టాలెంట్ అవసరం.
⇒ ఇంజనీర్లు: 90 వేల మందిలో 70% మందికి స్కిల్ గ్యాప్.
⇒ డిజైన్ రంగం: 20 వేల మందిలో 75% మందికి సరైన నైపుణ్యాలు లేవు.
⇒ క్వాంటమ్ టెక్నాలజీ: 20 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 75% వరకు నైపుణ్య లోటు.
⇒ గ్రీన్ హైడ్రోజన్–రిన్యూవబుల్స్: లక్షకుపైగా ఉద్యోగాల్లో 60% వరకు స్కిల్డ్ టెక్నీíÙయన్ల అవసరం.
⇒ డిఫెన్స్ టెక్–డ్రోన్లు: 75 వేల ఉద్యోగాల్లో 55% వరకు పరిశోధన, డెవలప్‌మెంట్ ఇంజనీర్ల కొరత.
సర్వే నివేదికలోని గణాంకాలు ఇలా..
⇒ 48% కంపెనీలు నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు లేక ఇబ్బంది పడుతున్నాయి.
⇒ 55% యువత సరైన ఉద్యోగం దొరకడం కష్టమని చెబుతున్నారు.
⇒ 1.2 కోట్ల యువత ఏటా ఉద్యోగాల కోసం మార్కెట్లోకి వస్తున్నారు.
⇒ అందులో 60 లక్షల మందికి మాత్రమే తగిన అనుభవం ఉంటోంది.
⇒ నైపుణ్యంగల ఉద్యోగులను నియమించడం సవాల్‌గా మారిందని 60% కంపెనీలు చెబుతున్నాయి.
⇒ 78% ఉద్యోగాలు డిజిటల్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి కొత్త రంగాలవే.