స్థానిక సంస్థల్లో వార్డుల సంఖ్య ఖరారు | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థల్లో వార్డుల సంఖ్య ఖరారు

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

● ప్రభుత్వానికి డీలిమిటేషన్‌ కమిషన్‌ సిఫార్సు

సాక్షి, చైన్నె: తమిళనాడులో స్థానిక సంస్థల వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగవంతమైంది. రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థల్లో ఎన్నుకోవాల్సిన కొత్త సభ్యుల (కౌన్సిలర్లు/వార్డు మెంబర్లు) సంఖ్యను ఖరారు చేస్తూ తమిళనాడు సరిహద్దుల పునర్విభజన కమిషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సిఫార్సు చేయాలని నిర్ణయించింది. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, డీలిమిటేషన్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ పా. జ్యోతి నిర్మలా స్వామి అధ్యక్షతన చైన్నెలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు జిల్లాల్లోని స్థానిక సంస్థల పరిధులు, జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చించారు.

11 జిల్లాలు, 40 యూనియన్లపై ప్రత్యేక దృష్టి

కీలక సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల్లో వార్డుల సరిహద్దుల పునర్విభజన, కొత్త సభ్యుల సంఖ్యను నిర్ణయించడంపై విస్తృతంగా చర్చించారు. ఈ మేరకు 11 జిల్లా పరిషత్తులు, 40 పంచాయతీ యూనియన్లు, 177 గ్రామ పంచాయతీలు జాబితాలో ఉన్నారు. ఈ ప్రాంతాల్లో జనాభా మార్పునకు అనుగుణంగా ఎన్నుకోవాల్సిన కొత్త ప్రతినిధుల సంఖ్యను తుది రూపానికి తెచ్చారు. ఈ నివేదికను త్వరలోనే తదుపరి చర్యల కోసం తమిళనాడు ప్రభుత్వానికి పంపాలని కమిషన్‌ తీర్మానించింది. ఈ సమీక్షా సమావేశంలో పునర్విభజన ప్రక్రియకు సంబంధించి పలు విభాగాల అధిపతులు పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ అముదవల్లి, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ పి. మధుసూదన్‌ రెడ్డి, చైన్నె కార్పొరేషన్‌ కమిషనర్‌ జి.ఎస్‌. సమీరన్‌తో పాటూ పలువురు ఉన్నతాధికారులు హాజరై సరిహద్దుల గణంకాల లెక్కింపు విషయంగా తమ సూచనలను అందించారు. ప్రభుత్వ ఆమోదం అనంతరం ఈ కొత్త వార్డుల వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement