వేలూరు: వేలూరు జిల్లా కాట్పాడిలో సిప్‌కాడ్ ప్రాజెక్టును రద్దు చేసి రైతుల వ్యవసాయ భూములను కాపాడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోరంతాంగల్ శేఖర్ మాట్లాడుతూ కాట్పాడి తాలుకా సమీపంలోని పొన్నై వద్ద సిప్‌కాడు కోసం రెవెన్యూ అధికారులు రైతులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సర్వే పనులు చేస్తున్నారని ఆరోపించారు. తరాలుగా ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయ పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారని ప్రస్తుతం ఉన్న ఫలంగా వ్యవసాయ పొలాన్ని సిప్‌కాడ్‌కు స్వాధీనం చేస్తే రైతులు వీధిన పడే అవకాశం ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో మాజీ మంత్రి దురైమురుగన్ వద్ద వీటిపై వినతిపత్రం ఇవ్వడంతో ఈ ప్రాజెక్టును నిలుపుదల చేస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రావడంతో మరోసారి సర్వే పనులు చేసి తమ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును నిలుపుదల చేసి తమ పంట భూములను కాపాడకుంటే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. ధర్నా అనంతరం కలెక్టర్ లీల వద్ద వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ పీపీ చంద్రప్రకాష్, రైతులు పాల్గొన్నారు.


