టీవీకే ఆహ్వానంపై పరిశీలన | - | Sakshi
Sakshi News home page

టీవీకే ఆహ్వానంపై పరిశీలన

May 21 2026 2:05 AM | Updated on May 21 2026 2:05 AM

సాక్షి, చైన్నె: మంత్రి వర్గంలో చేరాలన్న టీవీకే పిలుపుపై వీసీకే తిరుమావళవన్‌ స్పందిస్తూ, తమ పార్టీవర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, కేబినెట్‌లో చేరాలనే ఆలోచన ఉంటే దానిపై వీసీకే స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని సీపీఎం నేత షణ్ముగం వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో మళ్లీ ఎన్నికలు రాకూడదని, గవర్నర్‌ చేతుల్లోకి అధికారం వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ప్రజల తీర్పును గౌరవిస్తూ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని, కార్మికులు, పేదల పక్షాన తమ గళం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటామని సీపీఐ రాష్ట్రకార్యదర్శి వీర పాండియన్‌ స్పష్టం చేశారు.మంత్రివర్గంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించడం టీవీకే నాయకత్వం ఉదారతకు నిదర్శనమని ఐయూఎంఎల్‌ నేత ఖాదర్‌ మోహిద్దీన్‌ వ్యాఖ్యానించకారు. కేబినెట్‌లో చేరడంపై తాము ఇంకా ఎలాంటి ముందస్తు నిర్ణయానికి రాలేదని, దీనిపై పార్టీ జాతీయ నాయకత్వంతో పాటు ముస్లిం సామాజిక వర్గ పెద్దలతో కూడా చర్చిస్తున్నామని తెలిపారు. పార్టీ హైపవర్‌ కమిటీ సమావేశం అనంతరం గురువారం ఉదయం 11 గంటలకు తమ తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని ఖాదర్‌ మొహిదీన్‌ వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో ఔషధాల

విక్రయాన్ని నిషేధించాలి

– వ్యాపారుల సంఘం డిమాండ్‌

కొరుక్కుపేట: ఆన్‌లైన్‌లో మందుల వ్యాపారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాలని తమిళనాడు వాణిజ్య, పారిశ్రామిక మండలి డిమాండ్‌ చేసింది. ఈమేరకు ఔషధ వ్యాపారులు బుధవారం చేస్తున్న దేశవ్యాప్త సమ్మెకు, తమిళనాడు వాణిజ్య, పారిశ్రామిక మండలిపూర్తి మద్దతును తెలియజేసింది. ఆన్‌ లైన్‌ వ్యాపారం దేశీయ వ్యాపారాన్ని పూర్తిగా నాశనం చేయగలదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇది దేశీయ వ్యాపారులను మాత్రమే కాకుండా, వ్యాపారులపై ఆధారపడిన ప్రజలను కూడా ప్రభావితం చేస్తుందన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు వాణిజ్య పారిశ్రామిక మండలి అధ్యక్షుడు సౌందరరాజన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలందరి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి. అదే న్యాయం అని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో మాదకద్రవ్యాల వ్యాపారం చాలా ప్రమాదకరం అని అన్నారు. ఇప్పటికై నా ఆన్‌లైన్‌ ఫార్మాస్యూటికల్‌ వ్యాపారాన్ని తక్షణమే నిషేధించాలని కోరారు.

ఇండియన్‌ బ్యాంక్‌కు

గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు

సాక్షి, చైన్నె: బ్యాంకింగ్‌ రంగంలో అత్యాధునిక సాంకేతికతను జోడించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ ఇండియన్‌ బ్యాంక్‌ ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ – 2026 ను కై వసం చేసుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఆవిష్కరణల ద్వారా బ్యాంకింగ్‌ సేవలను డిజిటలైజ్‌ చేయడంలో చూపిన ప్రతిభకుగాను ఈ పురస్కారం దక్కింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ నిర్వహించిన నేషనల్‌ కన్వెన్షన్‌ ఆన్‌ బిజినెస్‌ ఎక్సలెన్స్‌ – లీడర్‌షిప్‌ సదస్సులో భాగంగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ఇండియన్‌ బ్యాంక్‌ తరపున ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కుమారి మిని టి. ఎం, చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ వాలెరి రాత్‌, చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ వెంకట్‌ యల్లాపంతుల ఈ అవార్డును అందుకున్నారు.

చైన్నె కార్పొరేషన్‌ తాగునీటి బోర్డుకొత్త ఎండీగా టి. ఆనంద్‌

కొరుక్కుపేట: ఐఏఎస్‌ అధికారి టి. ఆనంద్‌ను చైన్నె మెట్రోపాలిటన్‌ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం గురువారం అధికారిక ఉత్తర్వు జారీ చేసింది. పరిపాలనా నైపుణ్యాలు కలిగిన ఆనంద్‌, ప్రస్తుతం డ్రింకింగ్‌ వాటర్‌ బోర్డుకు ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ బోర్డు చైన్నె తాగునీటి అవసరాలను తీర్చడంలో, భూగర్భ మురుగునీటి ప్రాజెక్టులను అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గతంలో వివిధ ప్రభుత్వ శాఖలలో ఐఏఎస్‌ అధికారిగా తనదైన ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు చైన్నె మహానగరంలో తాగునీటి నిర్వహణ, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే కీలక బాధ్యతలను చే పట్టనున్నారు. వేసవి కాలం ఉధృతంగా కొనసాగుతున్న తరుణంలో, చైన్నెకి నిరంతరాయంగా నీటి సరఫరాను నిర్ధారించే సవాలుతో కూడిన పనిని ఆయన యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నారు. ప్రభుత్వం చేసిన ఈ నాటకీయ నియామకాన్ని ఐఏఎస్‌ అధికారులు విస్తృతంగా స్వాగతించారు.

Advertisement
 
Advertisement
Advertisement