వేలూరు: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో జరిగే చిత్ర పౌర్ణమి వేడుకలకు తిరువణ్ణామలై పట్టణంలో మొత్తం 16 చోట్ల తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తర్పగరాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. తిరువణ్ణామలై చిత్ర పౌర్ణమి వేడుకలు గురువారం రాత్రి 9.52 గంటలకు ప్రారంభమై శుక్రవారం రాత్రి 11.08 గంటలకు ముగుస్తాయి. ఈ సమయంలో గిరివలయం రావాలని ఆలయ అధికారులు ప్రకటించిన విషయం విధితమే ఈ వేడుకలకు చిత్ర పౌర్ణమికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్ర, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపద్యంలో పట్టణంలో ట్రాఫిక్ సమస్య రాకుండా ఆయా రోడ్లులోనే తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చే ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులు పోలూరు మార్గంలో తిరువణ్ణామలై బైపాస్ సమీపంలోని శ్రీ ముకాంబిగై నగర్, ఎకేఎస్ నగర్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌లో భక్తులను దింపి వేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్తాయన్నారు. అదే విధంగా తిరుత్తణి, వేలూరు, కేజీఎఫ్, ఆర్కాడు, ఆరణి వంటి ప్రాంతాల నుంచి తిరువణ్ణామలై వచ్చే బస్సులు గిరివలయం రోడ్డు సమీపంలోని అన్నా విగ్రహం వద్ద తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవ్యలూరు పేట రోడ్డు, కాంచిపురం మేల్‌మరవత్తూరు రోడ్డు, వందవాసి, సేత్తుపట్టు, దిండివనం రోడ్డు, చైన్నె– పుదుచ్చేరి రోడ్డు, వేట్టవలం రోడ్డు, తిరుకోవిలూరు రోడ్డు వంటి ఆయా రోడ్లులోనే తాత్కాలిక బస్టాండ్‌లు ఏర్పాటు చేశామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కేటాయించిన బస్టాండ్‌కు మాత్రమే రావాలని పట్టణంలో ట్రాపిక్ సమస్య రాకుండా చూడాలన్నారు. అదే విధంగా 90 చోట్ల కార్లు, బైకులకు ప్రత్యేక పార్కింగ్ వసతి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
4,300 ప్రత్యేక బస్సులు ఏర్పాటు
చిత్ర పౌర్ణమికి భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో తమిళనాడు ట్రాన్స్‌పోర్టు అద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు 4.300 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ఏపీఎస్‌ఆర్‌టీ ఆధ్వర్యంలో 400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే చిత్రా పౌర్ణమికి ఐదు వేల మందితో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.


