సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక రాజకీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే, ఎండీఎంకేలు తీవ్రంగా స్పందించాయి. వివరాలు.. నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ 2023 సిఫార్సుల మేరకు, 2026–27 విద్యాసంవత్సరం నుండి సీబీఎస్‌ఈ పాఠశాలల్లోని 6వ తరగతి విద్యార్థులకు మూడవ భాషను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిని అమలు చేయడానికి పాఠశాలలకు కేవలం ఒక వారం సమయం మాత్రమే ఇచ్చింది.
పలు పార్టీల అభ్యంతరాలు..
డీఎంకే పుదుచ్చేరి రాష్ట్ర ఆర్గనైజర్ శివ స్పందిస్తూ, బహుభాషా నైపుణ్యం పేరుతో హిందీని రుద్దుతున్నారని, దీనివలన విద్యార్థులపై భారం పెరుగుతుందని విమర్శించారు. పుదుచ్చేరికి ఉన్న ప్రత్యేక సాంస్కతిక గుర్తింపు అయిన ఫ్రెంచ్ భాషను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పుదుచ్చేరి డీఎంకే తరపున పెద్ద ఎత్తున ’భాషా హక్కుల పోరాటం’ నిర్వహిస్తామని ప్రకటించారు. అన్నాదురై హయాం నుండి ఉన్న ద్విభాషా విధానమే (తమిళం మరియు ఇంగ్లీష్) సరైనదని ఆయన స్పష్టం చేశారు. అన్నాడీఎంకే కార్యదర్శి అన్భళగన్ స్పందిస్తూ, పుదుచ్చేరిలో అన్నాడీఎంకే ఎప్పుడూ ద్విభాషా విధానానికే మద్దతు ఇస్తుందన్నారు. త్రిభాషా విధానం వలన విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడుతుందని, ప్రభుత్వం దీనిపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలని కోరారు.పుదుచ్చేరిలోని ప్రభుత్వ పాఠశాలల్లో త్రిభాషా విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కాగా, ఎండీఎంకే నేత వైగో సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ఫ్రెంచ్ సంస్కృతికి చరమగీతం పాడే దిశగా కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తంచేశారు.


