సాక్షి, చైన్నె: పుదుచ్చేరిలో రాజకీయ మార్పు తప్పనిసరి టీవీకే అధ్యక్షుడు విజయ్ పిలుపునిచ్చారు. తమిళనాడులోనే కాదు, పుదుచ్చేరిలోనూ తమ పాలన షురూ అని ధీమా వ్యక్తం చేశారు. విజిల్ విప్లవం మార్మోగే విధంగా ఈల గుర్తుకు ఓట్ల వేసి ఆదరించాలని, ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విన్నవించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 28 చోట్ల టీవీకే, మరోరెండు చోట్ల ఆ పార్టీతో కలిసి వచ్చిన చిన్న పార్టీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అభ్యర్థులకు మద్దతుగా శనివారం విజయ్ రోడ్ షో, ప్రచార సభ నిర్వహించారు. విజయ్‌కు అడుగడుగున అభిమానులు నీరాజనాలు పలికారు.అభిమానం ఉప్పొంగే రీతిలో ఆయన వెన్నంటి దూసుకొచ్చారు. ప్రజలకు, అభిమానులకు అభివాదం తెలుపుతూ విజయ్ ప్రచార రధంలో ముందుకు సాగారు. 12 కి.మీ దూరం రోడ్ షో జరిగింది. కొన్నిచోట్ల అభిమానులు దూకుడుగా ప్రదర్శించి, ద్విచక్రవాహనాల నుంచి కింద పడ్డ ఘటనలు అనేకం. కొన్ని చోట్ల అభిమానులపై పోలీసులు లాఠీలకు పని పెట్టక తప్పలేదు. ఓ మహిళ ఎండ వేడి తాళ లేక స్పృహ తప్పడంతో ఆస్పత్రికి తరలించారు. తొలుత తట్టాన్ చావడిలో ఆ తదుపరి కడలూరు మార్గంలో ప్రచార సభకు ఏర్పాటు చేశారు. తట్టాన్ చావడిలోనే సమయం ఎక్కువ కావడంతో చివరకు కడలూరు మార్గంలో ప్రసంగించకుండానే విజయ్ అభిమానులకు అభివాదం తెలుపుతూ ముందుకెళ్లారు.
అయోమయ కూటమి
పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారంలో విజయ్ ప్రసంగిస్తూ, ఇక్కడున్న రాజకీయ కూటములపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడు, పుదుచ్చేరిలో కొత్త రాజకీయ మార్పు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తమిళనాడులోనైనా, పుదుచ్చేరిలోనైనా డీఎంకే – కాంగ్రెస్ కూటమి ఒక అయోమయ కూటమి అని విజయ్ ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేయడంలో ఈ పార్టీలు ఒకదాని కొకటి పోటీ పడుతున్నాయని విమర్శించారు. మరోవైపు బీజేపీ , ఎన్‌ఆర్ కాంగ్రెస్ కూటమిని ‘నీరసించిపోయిన కూటమి‘గా ఆయన అభివర్ణించారు. వారి మధ్య సరైన సయోధ్య లేదని, కేవలం అధికారం కోసమే కలిసి ఉన్నారని మండిపడ్డారు.
ఏదీ పుదుచ్చేరి రాష్ట్ర హోదా
పుదుచ్చేరి ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్ర హోదా గురించి కాంగ్రెస్, బీజేపీను విజయ్ ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు పార్టీలు ఎందుకు రాాష్ట్ర హోదా ఇవ్వలేదని మండి పడ్డారు. 20 ఏళ్ల క్రితమే సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చినా ఎందుకు అమలు కాలేదు? అని నిలదీశారు. టీవీకే ఏ పార్టీతోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోలేదని, తాము ప్రజల పక్షాన ఒంటరిగా నిలబడ్డామని విజయ్ స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో టీవీకే అభ్యర్థులతో పాటు, మిత్రపక్షమైన నేయం మక్కల్ కళగం అభ్యర్థులను గెలిపించాలని కోరారు.: తమిళనాడు, పుదుచ్చేరిలో మార్పు రావాలంటే ‘విజిల్ విప్లవం‘ రావాలని, టీవీకే గుర్తు అయిన విజిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు.
అందరికీ రక్షణ
పుదుచ్చేరిలో మైనారిటీలతో సహా అందరికీ రక్షణ తప్పని సరిగా పేర్కొన్నారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కేవలం పేరుకే ఉందని, బీజేపీ కూటమిలో ఉన్నవారు ఒత్తిడితో చేరిన వారేనని వ్యాఖ్యలు చేవారు. ఒకరినొకరు మింగేయాలని చూసే ఈ రెండు కూటముల ద్వారా ప్రజలకు ఒరిగేది శూన్యమేనని విమర్శించారు. ప్రజలకు నిజమైన మంచి పాలన, నమ్మకమైన ప్రభుత్వం కావాలంటే టీవీకే పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు. గతంలో పుదుచ్చేరిలో రేషన్ షాపులే లేవని తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, తాను తెలియక మాట్లాడాను అనే అనుకోండి.. కానీ పుదుచ్చేరిలో ప్రజా పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్టుగా వస్తున్న వార్తలపై ఏదీ సమాధానం అని నిలదీశారు.
ఎన్నికల వాగ్దానాలు
విజయ్ పుదుచ్చేరి ప్రజల కోసం అనేక వాగ్దానాలు ప్రకటించారు. లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం లేని పూర్తి స్థాయి రాష్ట్ర హోదా సాధించడానికి 100 శాతం చట్టపరమైన న్యాయ పోరాటం చేస్తాం. టీవీకే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం. గర్భిణులకు రూ. 25,000 ప్రసూతి ఆర్థిక సాయం అందిస్తాం. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేస్తాం. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తాం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం. రైతులకు 100 శాతం పంట బీమా సౌకర్యం కల్పిస్తాం.


