– కాట్టుమన్నార్ కోయిల్‌లో జ్యోతిమణి
సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి వీసీకే అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో కాట్టుమన్నార్ కోయిల్ నుంచి పార్టీ ప్రతినిధి జ్యోతిమణి పోటీ చేయనున్నారు. వివరాలు.. డీఎంకే కూటమిలో వీసీకేకు 8 సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముగ్గుర్ని ఈసారి పక్కన పెట్టి, అంతా కొత్త ముఖాల్ని తెర మీదకు తెచ్చారు. అదే సమయంలో తాను కాట్టుమన్నార్ కోయిల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు వీసీకే నేత తిరుమావళవన్ ప్రకటించారు. దీంతో కాట్టుమన్నార్‌కోయిల్ నియోజకవర్గంలో వీపీఐ జాబితాలో చేరింది. అదే సమయంలో తిరుమావళవన్ పోటీపై అనేక విమర్శలు , ఆరోపణలు బయలుదేరాయి. పార్టీకోసం శ్రమించిన కీలక ఎమ్మెల్యే షానవాజ్‌ను సైతం ఆయన పక్కన పెట్టడం ఏమిటో..? అన్న విమర్శలు హోరెత్తాయి. ఎంపీగా ఉన్న ఆయన ఎ మ్మెల్యేగా పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు పెదవి విప్పే పనిలో పడ్డారు. అలాగే, రానున్న ఎన్నికలలో హంగ్ రావడం తథ్యమని తిరుమా గ్రహించినట్టు, డీప్యూటీ సీఎం పదవి లక్ష్యంగానే ఆయన ఎమ్మెల్యే అయ్యేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో తిరుమా పోటీ వ్యవహారం డీఎంకే కూటమిలో చర్చతోపాటుగా, వివాదాస్పదంగా మారింది. ఈ పరిస్థితులలో శనివారం రాత్రి తిరుమావళవన్ మీడియా ముందుకు వచ్చారు. తనకు పదవీ ఆశ లేదని, ఆరోపణలన్నీ ఖండిస్తున్నట్టు వ్యాఖ్యలు చేశారు. తాను ఓ పార్టీ అధ్యక్షుడ్ని అని, తన ఎమ్మెల్యేలు తన మాటే వింటారని పేర్కొంటూ, అలాంటప్పుడు అసెంబ్లీలోకి వెళ్లి మరీ తాను వ్యూహాలు రచించాల్సిన అవశ్యం లేదన్నారు. తాజాగా వస్తున్న ఆరోపణలు, విమర్శలు, కూటమికి అపవాదు తెచ్చే రీతిలో ఉండటంతో ఎన్నికల నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తన స్థానంలో కాట్టుమన్నార్ కోయిల్ నియోజకవర్గంలో ప్రజాఉద్యమ కారుడైన ఇలయ పెరుమాల్ కుటుంబానికి చెందిన జ్యోతిమణి పోటీ చేస్తారని ప్రకటించారు. మళ్లీ చెబుతున్నానని, తనకు పదవీ ఆశ లేదని స్పష్టం చేశారు. గతంలో కూడా తాను పోటీ చేయడానికి సిద్ధమైనా.. చివరకు ఆ సీటును కక్కన్‌కుటుంబానికి అప్పగించానని గుర్తు చేశారు. వీసీకేలో ఎలాంటి విభేదాలు లేవు అని అందరూ ఐక్యంగానే ఉన్నట్టు స్పష్టం చేశారు.


