తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం | - | Sakshi
Sakshi News home page

తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం

Apr 5 2026 8:24 AM | Updated on Apr 5 2026 8:24 AM

● విడుదల చేసిన పీయూష్‌ గోయల్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళనాడు బీజేపీకి చెందిన శ్రీప్రొఫెషనల్‌ సెల్‌ రూపొందించిన రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల శ్రీశ్వేతపత్రాన్ని శనివారం చైన్నెలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం ఎం.కె. స్టాలిన్‌కు పలు ప్రశ్నలు సంధించారు.

అప్పుల ఊబిలో తమిళనాడు

ఈ శ్వేతపత్రంలోని ప్రధానాంశాలను కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వివరించారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ లోపాలను గణాంకాలతో సహా వివరించారు. కేంద్రం నుంచి తమిళనాడుకు లక్షల కోట్ల రూపాయల నిధులు అందాయని, జీఎస్‌టీ ద్వారా రాష్ట్ర ఆదాయం మునుపెన్నడూ లేనంతగా పెరిగిందని వివరించారు. మరి ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సొమ్ము అంతా ఎక్కడికి పోయింది? అని నిలదీశారు. 2024లో రూ.8.34 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు, 2027 నాటికి రూ.10.7 లక్షల కోట్లకు చేరుకుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుల్లో కేవలం 31 శాతం మాత్రమే రోడ్లు, వంతెనల వంటి అభివృద్ధి పనులకు వాడుతున్నారని, మిగిలిన 69 శాతం పాత అప్పులకు వడ్డీలు కట్టడానికి, జీతాలు ఇవ్వడానికే సరిపోతోందని విమర్శించారు. గతంలో రూ.36,000 కోట్లుగా ఉన్న వడ్డీ చెల్లింపులు తాజాగా రూ. 76,000 కోట్లకు పెరిగాయని వివరించారు. ప్రభుత్వం ఆదాయంలో చే ప్రతి 100 రూపాయల్లో 21 రూపాయలు కేవలం వడ్డీకే సరి పోతోందన్నారు. ప్రభుత్వ లెక్కల్లో చూపని మరో రూ.1.7 లక్షల కోట్ల అప్పులు ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో ఉన్నాయని గోయల్‌ ఆరోపించారు.

విద్యుత్‌ శాఖకు నష్టాలు

విద్యుత్‌ శాఖ నష్టం రూ. 1.6 లక్షల కోట్లకు చేరిందని, ఏటా రూ. 15,000 కోట్ల సబ్సిడీ ఇస్తున్నా ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయి? అని ప్రశ్నించారు. ఈ సబ్సీడీ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోంది? అని ప్రశ్నించారు. ఆర్థిక సంక్షోభం వలన 28,000 మంది రవాణా రంగ కార్మికులకు రావాల్సిన పీఎఫ్‌ నిధులు 25 నెలలుగా నిలిచిపోయాయని, ప్రభుత్వ ఉద్యోగులు నగలు తాకట్టు పెట్టుకుని బతకాల్సిన దుస్థితి వచ్చిందని మండిపడ్డారు.

తమిళనాడు దివాళా తీయబోతోందా?

ఒక రాష్ట్ర ఆదాయంలో 70 శాతం నిధులు కేవలం జీతాలు, వడ్డీలకే ఖర్చయితే ఆ రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు.తమిళనాడు ఇప్పటికే ఆ ప్రమాదకరమైన 64 శాతంస్థాయికి చేరుకుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ అరవింద్‌ మీనన్‌, కో ఇన్‌చార్జ్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement