సాక్షి, చైన్నె: పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు పుదుచ్చేరికి తరలి వస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై మొదలియార్, అరియంగుప్పం, మనవేలి ప్రాంతాల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆదివారం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొననున్నారు. 6వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ ఒకే రోజు పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. ప్రచారానికి చివరి రోజైన మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా ప్రచారం చేయనున్నారు. దీంతో పుదుచ్చేరిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తిరుత్తణి: తిరుత్తణిలో ద్రౌపదీదేవి ఆలయ వేడుకల్లో భాగంగా శనివారం దరణివరాహపురంలో అమ్మవారు ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుత్తణి గాంధీరోడ్డు లో ని ద్రౌపదీదేవి ఆలయంలో గతనెల 26న అగ్ని గుండ వేడుకలకు ధ్వజారోహణం నిర్వహించా రు. రోజూ అమ్మవారికి విశేష అభిషేక పూజలు నిర్వహించి అమ్మవారిని పట్టణ శివారు గ్రామ వీధుల్లో ఊరేగించారు. శనివారం ధరణివరాహపురంలో అమ్మవారిని ఊరేగించారు. భక్తులు తమ శరీరానికి ఇనుప చువ్వలు గుచ్చు కుని అమ్మవారి వాహనాన్ని లాగి ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామవీధుల్లో ఊరేగించారు. మహిళలు కర్పూర హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారిని దర్శించుకున్నారు.
కొరుక్కుపేట: చైన్నె జిల్లాలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. ఓటర్ల జాబితాలో భారీ సవరణల అనంతరం, చైన్నె నగరంలో 40 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 28 లక్షలకు తగ్గింది. దీంతో ఓటింగ్ శాతం తగ్గకుండా చూసేందుకు ఎన్నికల సంఘం దృష్టి సారిస్తోంది. వంద శాతం ఓటింగ్ జరిగేలా చైన్నె జిల్లా ఎన్నికల కమిషనర్ కుమారగురుబరన్ చర్యలు తీసుకుంటున్నారు. ఓటు వేయడం ప్రజాస్వామ్య కర్తవ్యం అని, జాతీయ ప్రయోజనాలను కాపాడడానికి ప్రతిఒక్కరూ ఓటు వేయాలని అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం చైన్నెలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా సెంట్రల్ మెట్రో స్టేషన్ లో ఒక జానపద కళాకారుల ప్రదర్శన జరిగింది. ఈ ప్రచారం ప్రస్తుతం ఒక అవగాహన ప్రచారంగా కొనసాగుతోంది.
అన్నానగర్: చిదంబరం సమీపంలో శుక్రవారం ఎన్నికల భద్రతా పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, తాలూకా పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వివరాలు.. కడలూరు జిల్లాలోని కీరపాలయం మేట్టు వీధికి చెందిన సెల్వరాజ్ కుమారుడు ఎస్.ప్రభు (42) చిదంబరం తాలూకా పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభు శుక్రవారం రాత్రి కాట్టుమన్నార్ కోవిల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాల్లో ఎన్నికల గస్తీలో నిమగ్నమై ఉన్నారు. ఆయన రాత్రి సుమారు 10 గంటలకు తన పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఓరత్తూరు పోలీస్ పరిధిలోని సాత్తమంగళం సమీపానికి వెళ్లినప్పుడు, ఓ మినీ ట్రక్కు మోటార్ సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. విసిరివేయబడి గాయపడిన ప్రభును, అక్కడున్నవారు రక్షించి, 108 అంబులెన్స్‌లో చిదంబరంలోని అన్నామలైనగర్‌లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతనికి తీవ్ర చికిత్స అందించినప్పటికీ, అర్ధరాత్రి ఎటువంటి చికిత్స ఫలించక మరణించాడు. ప్రమాదంలో మరణించిన ప్రభుకు భార్య సుమతి, ఇద్దరు కుమార్తెలు సమీక్ష, జీవిషా ఉన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో జరిగిన ఈ మరణం పోలీసులకు తీవ్ర విషాదాన్ని నింపింది. ఒరత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తిరువొత్తియూరు: భార్యపై కోపంతో ఇంట్లో వున్న నగలను తీసుకొని పర్యాటకానికి వెళుతున్న కార్మికుడి వద్ద బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తరువాత నగలను భార్యకు అప్పగించారు. కున్నూర్ కొండ మార్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆసమయంలో బైక్‌లో వచ్చిన వ్యక్తి వద్ద తనిఖీ చేశారు. అతని బైక్‌లో రూ.12 లక్షల విలువైన బంగారు నగలు ఉన్నట్లు తెలిసింది. విచారణలో అతను మేట్టుపాళయంలో కూలీ అని తెలిసింది. అతని భార్య పొల్లాచ్చిలో ఉందని కుటుంబ కలహాల కారణంగా నేను భార్య మీద కోపంతో ఇంట్లోని బంగారు నగలు తీసుకుని స్నేహితుడితో బైక్‌లో కున్నూర్ చూడడానికి వెళ్లినట్టు తెలిసింది. పోలీసులు అతని భార్యును పిలిపించి నగలను భార్యకు అప్పగించారు.


