తిరువళ్లూరు: క్వారీ అనుమతులను రద్దు చేయకుంటే తాము ఎన్నికలను బహిష్కరిస్తామని స్థానికులు రాస్తారోకో చేశారు. తిరువళ్లూరు జిల్లా చిత్తంబాక్కం గ్రామంలోని చెరువు మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉంది. రెండు వందల ఎకరాలకు పైగా చెరువు ఆయకట్టు వుంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం రోడ్డు విస్తరణ కోసం మట్టి క్వారీకి అనుమతి ఇచ్చారు. అప్పట్లో చేపట్టిన తవ్వకాలతో నీరు కలుజు వరకు రావడం లేదని, దీంతో సాగుకు ఇబ్బందికరంగా మారుతోందని స్థానికులు ఆరోపించారు. అయినా రెండవ విడత క్వారీకి ఇటీవల అనుమతి ఇచ్చారు. చెరువులో చేపట్టే తవ్వకాల ద్వారా మట్టిని రోడ్డు విస్తరణ పనుల కోసం వినియోగిస్తున్నారు. చెరువులో ఎక్కువగా తవ్వకాలు చేయడం వల్ల తాగు, సాగు నీటికి ఇబ్బందికరంగా మారుతోందని చిత్తంబాక్కం గ్రామస్తులు క్వారీని వెంటనే మూసివేయాలని, అనుమతులను రద్దు చేయాలని ఆందోళన నిర్వహిస్తున్నారు. అయితే ఇంత వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు శనివారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. క్వారీ అనుమతులను రద్దు చేయకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామన్నారు. విషయం తెలిసి సంఘటన స్థలానికి వెళ్లిన వెంగల్ పోలీసులు ఆందోళనకారులతో చర్చించి రాస్తారోకో విరమింపజేశారు. రాస్తారోకోతో రెండుగంటల పాటు ఉద్రిక్తత నెలకొంది.


