వీవీఐపీ నియోజకవర్గం జాబితాలో చేరిక రేసులో విజయ్ ప్రధాన ప్రత్యర్థిగా డీఎంకే నుంచి ఆర్‌డీ శేఖర్
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజధాని నగరం చైన్నె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ నగరం మూడుగా ముక్కలుగా ఉంది. అది లోక్‌సభ నియోజకవర్గంగా అయినా సరే, భౌగోళికంగా అయినా సరే ఇదే మాట. ఇందుకు కారణం అనాది నుంచి ఉత్తర చైన్నె, సెంట్రల్ చైన్నె, దక్షిణ చైన్నె పేర్లతో నగర పరిసరాలను పిలవడం సాధారణంగా మారింది. అదే సమయంలో ఉత్తర చైన్నెకు ముఖ ద్వారంగా ఉన్న పెరంబూరు నియోజకవర్గం ఎన్నికల వేళ వార్తల్లో చేరింది. ఇది కేవలం ఒక నియోజకవర్గం మాత్రమే కాదు, సామాజికంగా , సాంస్కృతిక విశిష్టతలను కలిగిన ప్రాంతంగా చెప్పవచ్చు. అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం కూడా ఇదే కావడం గమనార్హం.
ఇక్కడ స్థిర పడ్డ తెలుగు కుటుంబాలే కాదు, ఉత్తరాది వాసులు కూడా ఎక్కువే. తమిళ, తెలుగు, ఉత్తరాది సంస్కృతిని తనలో పెరంబూరు ఇముడ్చుకుని ఉంది. నాడు, నేడు, రేపు అన్నట్టుగా ఫుట్‌బాల్ క్రీడాకారులు, బాక్సింగ్ వీరులు, ప్రసిద్ధ ’గానా’ గాయకులు ఇక్కడ ఎక్కువే. ఈ పరిధిలో వ్యాసార్పాడి, కొడుంగయూరు, ఎరుకంచ్చేరి, వంటి కీలక రెవెన్యూ ప్రాంతాలు ఉన్నాయి. ముస్లింలు, క్రైస్తవ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కూడా మరీఎక్కువే. ఇక, గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా దళిత సామాజికవర్గం ఇక్కడ ఉంది.
2001 నుంచి 2011 వరకు మూడు ఎన్నికలలో సీపీఎం ఇక్కడ విజయ ఢంకా మోగించింది. ఈ సమయంలో సీపీఎం ఉన్న కూటమి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాయి. 2016లో ఈ కోటలో అన్నాడీఎంకే పాగా వేసింది. ఆ పార్టీ తరపున పి. వెట్రివేల్ విజయ కేతనం ఎగుర వేశారు. అయితే, జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో ఏర్పడ్డ చీలికతో టీటీవీ దినకరన్ వైపుగా ఆయన వెళ్లడంతో అనర్హత వేటు పడింది. ఉప ఎన్నికలో డీఎంకే పాగా వేసింది. గతంలో డీఎంకే చేతిలో ఉన్న ఈ నియోజకవర్గం కూటమి ధర్మం మేరకు చేతలు మారినా ఉప ఎన్నిక రూపంలో మళ్లీ వారి గుప్పెట్లోకి చేరింది. ఉప ఎన్నికలో డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్ విజయం సాధించారు. అంతేకాదు, 2021లో కూడా ఆయనే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా హ్యాట్రిక్ కొట్టే ప్రయత్నంలో రంగంలోకి దిగారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్‌డీ శేఖర్‌ను తక్కువగా అంచనా వేయలేం. ఉత్తర చైన్నె అభివృద్ధి ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ద్వారా ప్రజల మద్దతు కూడగట్టుకుని ఉన్నారు. ఇక్కడి యువత, పురుషులు అవసరాలను గుర్తించి జిమ్స్,పార్కులు, క్రీడా ప్రాంగణాల అభివద్ధికి పెద్ద పీట వేశారు. బాక్సింగ్ స్టేడియం నిర్మాణంలో సఫలీకృతులయ్యారు. ప్రజలలో మమేకం అయ్యే విధంగా ఆయన ముందడు వేసినా, ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించే రీతిలో కొడుంగయూరు నుంచి పునరద్దురణ పనులు మొదలైనా , ఇక్కడున్న కొన్ని శాశ్వత సమస్యలు ఎన్నికల కదనరంగంలో సుడిగుండాలుగా మారక తప్పదు. ఇక్కడ ఆర్‌డీ శేఖర్ మళ్లీ రేసులో ఉన్నారు. తాను చేసిన మంచి పనులు, ప్రభుత్వ ప్రగతి పథకాలు, నమ్ముకున్న వారికి అండదండగా తన పయనం గెలిపిస్తుందన్న ధీమా ఆర్‌డీ శేఖర్‌లో ఎక్కువే. అయితే, తమిళనాడు వెట్రి కళగం అధినేత, సినీ నటుడు విజయ్ స్వయంగా ఇక్కడి నుండి పోటీ చేస్తుండటంతో బలమైన నేతను ఢీ కొట్టాల్సిన పరిస్థితి తాజాగా ఆర్‌డీ శేఖర్‌కు తప్పడం లేదు. అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలోని అన్బుమణి శిబిరానికి చెందిన పీఎంకే కోశాధికారి తిలక భామ ఇక్కడ రేసులో ఉన్నారు. నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా నటుడు వెట్రి తమిళన్ పొటీలో ఉన్నారు. వీరు ఏదో కొంత మేరకు ఓట్లను చీల్చడం ఖాయం.
ఈ నియోజకవర్గంలో పురుషులు –1,07,995 మంది, మహిళలు 1,14,726 మంది, ఇతరులు 71 మందిఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 2,22,792 మంది ఉన్నారు. 2021 ఎన్నికలలో డీఎంకే అభ్యర్థి ఆర్‌డీ శేఖర్ 54 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. అయితే ఈసారి నటుడు విజయ్ ఎంట్రీ ఇవ్వడం, కొత్త ఓటర్ల ప్రభావం, స్టార్ పవర్ కారణంగా పోటీ అత్యంత తీవ్రంగా మారినట్టైంది. డీఎంకే మేనిఫెస్టో ఆ పార్టీకి బలాన్ని ఇస్తున్నప్పటికీ, విజయ్ క్రేజ్ ఓట్ల చీలికకు దారితీసే అవకాశం ఉందన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో టీవీకే వర్గాలు నియోజకవర్గంలో వినూత్న పందాను అనుసరిస్తూ సామాజిక మాధ్యమాలు, సెల్ పోన్లు, వాట్సాప్‌ల ద్వారా ఓటర్లకు చేరువయ్యే పనిలో పడ్డారు.
ఆర్‌డీ శేఖర్
విజయ్
తిలక భామ
వెట్రి తమిళన్
విజయ్ రాకతో..
ఉత్తర చైన్నె ముఖ ద్వారంగా ఉన్న పెరంబూరు నియోజకవర్గం తాజాగా వీవీఐపీ జాబితాలోకి చేరింది. తానే తమిళనాడు భవిష్యత్తు, తదుపరి సీఎం తానే అంటున్న టీవీకే అధినేత విజయ్ ఇక్కడ రేసులో ఉండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. విజయ్ రాకతో పెరంబూరులో రాజకీయ సమీకరణలు మారినట్లయ్యింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం తమిళనాడులోనే అత్యంత కీలకమైన నియోజకవర్గంగా మారింది.
ఇప్పుడు ఎవరి నోట విన్న పెరంబూరు మాటే. ఉత్తర చైన్నెకు ముఖ ద్వారంగా ఉన్న ఈ నియోజకవర్గం తాజాగా వీవీఐపీ జాబితాలోకి చేరింది. తెలుగు, తమిళ సంస్కృతితో పాటుగా ఉత్తరాది మేళవింపుతో నిండిన ఈ పరిసరాలలోని ఓటర్ల మద్దతుతో గెలుపు జెండా ఎగరేసేదెవ్వరో అనే చర్చ జోరందుకుంది. ఇందుకు కారణం ఇక్కడ అశేషాభిమాన హృదయాలలో ముద్ర వేసుకున్న నటుడు, తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ రేసులో ఉండటమే. అదే సమయంలో ఇక్కడ హ్యాట్రిక్ కొట్టేందుకు ఉవ్విల్లూరుతున్న ఆర్‌డీ శేఖర్ డీఎంకే అభ్యర్థిగా ఉండడమే ఇక సమరమే.
ఓటర్ల వివరాలు:
ఇప్పటివరకు ఈ నియోజకవర్గం 16 సాధారణ ఎన్నికలను, ఒక పర్యాయం ఉపఎన్నికను ఎదుర్కొంది. ఇక్కడ డీఎంకే 9 సార్లు జయ కేతనం ఎగుర వేసింది. సీపీఎం మూడు సార్లు, అన్నాడీఎంకే రెండుసార్లు, స్వతంత్ర అభ్యర్థులు 2 సార్లు, ఒక సారి కాంగ్రెస్ గెలిచింది. చారిత్రక నేపథ్యం ప్రకారం ఇది డీఎంకేకు కంచుకోటే అని చెప్పవచ్చు. అయితే తాజాగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, కొత్త పార్టీల రాకతో ఈసారి ఈ కోటకు బీటలు వారేనా అన్న ఆసక్తి పెరిగి ఉంది.
ఫ్లస్.. మైనస్ పాయింట్లు
రాజకీయ నేపథ్యం..
ప్రత్యేకతలు ఎన్నో..


