‘మోదీ’ ఎన్నికల వ్యూహాలు | - | Sakshi
Sakshi News home page

‘మోదీ’ ఎన్నికల వ్యూహాలు

Apr 5 2026 7:54 AM | Updated on Apr 5 2026 7:54 AM

● ఉన్నత స్థాయి కార్యవర్గ భేటీలో కీలక ఆదేశాలు ● గెలుపే లక్ష్యంగా దిశా నిర్దేశం

సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైన్నె పర్యటనలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం చైన్నెలో నిర్వహించిన ఉన్నత స్థాయి కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ, రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి కీలక ఉపదేశాలు, దిశానిర్దేశం చేశారు. పీఎం మోదీ శుక్రవారం పుదుచ్చేరిలో రోడ్‌ షో నిర్వహించి చైన్నెకు చేరుకున్న విషయం తెలిసిందే. రాత్రి గిండిలోని హోటల్‌లో ఆయన బస చేశారు. శనివారం ఉదయం తమిళనాడులోని బీజేపీ నేతలతో ఉన్నత స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, ఎల్‌. మురుగన్‌, రాష్ట్ర నేతలు నైనార్‌ నాగేంద్రన్‌, పొన్‌ రాధాకృష్ణన్‌, వానతి శ్రీనివాసన్‌, తమిళిసై సౌందరరాజన్‌ , మాజీ అధ్యక్షుడు అన్నామలై పాల్గొన్నారు. బీజేపీ పోటీచేస్తున్న నియోజకవర్గాలలో గెలుపు అవకాశాలపై ఇందులో చర్చించినట్టు సమాచారం. 28లో ప్రధానంగా 20 నియోజకవర్గాలపై మరింత ప్రత్యేక దృష్టి కేంద్రీకరించేందుకు వ్యూహరచన చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి డీఎంకే వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈసందర్భంగా మోదీ సూచించారు. గెలుపు లక్ష్యం అని, అత్యధిక స్థానాలలో అభ్యర్థులు విజయ ఢంకామోగించే విధంగా పనితీరు ఉండాలని ఆదేశించడమే కాకుండా,పలు సూచనలు, సలహాలతో దిశా నిర్దేశం మోదీ చేయడం విశేషం. అనంతరం చైన్నె పర్యటన ముగించుకుని కేరళలో ఎన్నికల ప్రచారానికి బయలు దేరి వెళ్లారు.

అన్నామలై క్లారిటీ

ఈ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయడం లేదనే విషయంపై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై మీడియాకు వివరణ ఇచ్చారు. తాను ఎన్నికల్లో పోటీ చేయకూడదని చాలా కాలం క్రితమే పీయూష్‌ గోయల్‌ , ఉన్నత స్థాయి కమిటీకి లిఖితపూర్వకంగా తెలిపినట్లు పేర్కొన్నారు. ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా, తమిళనాడు అంతటా పర్యటించి ఎన్డీయే అభ్యర్థులందరి తరపున ప్రచారం చేయడమే ప్రస్తుత ం తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఈసందర్భంగా విలేకరులు పదే పదే ప్రశ్నించగా పోటీ చేయకపోవడం వెనుక ఉన్న పూర్తి వివరాలను మే 4 (ఓట్ల లెక్కింపు) తర్వాత మాట్లాడుకుందాం అని సమాధానం ఇచ్చారు. ఏప్రిల్‌ 21 వరకు నిర్విరామంగా రాష్ట్రంలో పర్యటించనున్నట్టు ప్రకటించారు.

మోదీతో సంగీత దర్శకుడు రమేష్‌ వినాయకం

చైన్నెలో సంగీత దర్శకుడు రమేష్‌ వినాయకం ప్రధాని మోదీని కలిశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి మోదీతో భేటీ అయ్యారు. భారతీయ శాసీ్త్రయ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేసేందుకు రమేష్‌ వినాయకం చేస్తున్న కృషిని ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. 2009లో తాను అభివృద్ధి చేసిన గమక బాక్స్‌ నోటేషన్‌ సిస్టమ్‌ గురించి ప్రధానికి రమేష్‌ వినాయకం వివరించారు. భారతీయ సంగీతంలోని క్లిష్టమైన గమకాలను (వంపులు , అలంకారాలు) ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా డాక్యుమెంట్‌ చేయడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్రాను. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికతలను ఉపయోగించి భారతీయ సంగీత భాండాగారాన్ని నిర్మించే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉందని ఆయన తెలిపారు.ఈ భేటీలో కొన్ని ఆసక్తికరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. రమేష్‌ వినాయకం మార్గదర్శకత్వంలో ప్రధాని మోదీ ఒక టాబ్లెట్‌పై వందేమాతరం రాగాన్ని ప్లే చేయడానికి ప్రయత్నించారు. ప్రధాని ఉత్సాహాన్ని చూసి ముగ్ధుడైన రమేష్‌ వినాయకం, ఆయన్ని బెస్ట్‌ స్టూడెంట్‌ (ఉత్తమ విద్యార్థి) అని అభివర్ణించారు. తన వద్ద నేర్చుకునే వారికి సంప్రదాయబద్ధంగా ఇచ్చే పెన్సిల్‌, ఎరేజర్‌, ఖాళీ మ్యాన్యు స్క్రిప్ట్‌ను ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. చివరగా రమేష్‌ వినాయకం ఒక భక్తి గీతాన్ని ఆలపించగా, ప్రధాని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార మధ్యలో రమేష్‌ వినాయకంను కలవడం సంతోషంగా ఉందని, భారతీయ సంగీతాన్ని ప్రపంచానికి తీసుకెళ్లేందుకు ఆయన రూపొందించిన గమక బాక్స్‌ ఒక వినూత్న మార్గం‘ అని ప్రధాని మోదీ ఈసందర్భంగా తన ఎక్స్‌ పేజీలో పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement