అన్నానగర్: దిండుక్కల్ జిల్లా ఒట్టన్‌చత్రం విరూపాచ్చి పర్వత శ్రేణిలో ఎగువ తాలైయుత్తు జలపాతం, దిగువ తాలైయుత్తు జలపాతం ఉన్నాయి. ఇందులో దిగువ తాలైయుత్తు జలపాతంలో సమాధులు ఉండటంతో అక్కడ స్నానం చేయడానికి అనుమతి లేదు. అటవీ శాఖ దీనిని నిషేధిత ప్రాంతంగా ప్రకటించింది. ఈ స్థితిలో కరూర్ జిల్లా, పల్లపట్టికి చెందిన విద్యార్థులైన అహ్మద్ సిరాజ్ కుమారుడు ఆదిల్ (19), నాజర్ అలీ కుమారుడు సద్దాం హుస్సేన్ (18) కుమారుడు, షేక్ అలా ఉద్దీన్ కుమారుడు అయాస్(19), ఉమర్ ఫరూఖ్ కుమారుడు పయాస్(19) వీరితో సహా 11 మంది శుక్రవారం సాయంత్రం జలపాతం ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఆ సమయంలో, నిషేధిత ప్రాంతంలో స్నానం చేస్తుండగా నలుగురు జలపాతంలో మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన తోటి విద్యార్థులు కేకలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఒట్టంచత్రం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. రాత్రి చీకటిగా ఉండటంతో గాలింపును నిలిపివేసి, శనివారం ఉదయం తిరిగి ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర దుఃఖంలో ఉన్నారు. ఈ స్థితిలో శనివారం ఉదయం బండరాళ్ల కింద చిక్కుకున్న నలుగురు విద్యార్థుల మృతదేహాలను అగ్నిమాపక శాఖ, పోలీసులు వెలికితీశారు.
తీవ్రంగా అవమానించారు!
సాక్షి, చైన్నె: తమిళర్ వాల్వురిమై కట్చి అధ్యక్షుడు, ఎమ్మెల్యే వేల్ మురుగన్ డీఎంకేపై తీవ్రస్థాయిలో శనివారం విరుచుకుపడ్డారు. తనను అవమానించారని, మోసం చేశారని మండిపడ్డారు. 2019 నుంచి డీఎంకే కూటమిలో తమిళర్ వాల్వురిమై కట్టి కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికలలో అదనంగా సీట్లు అడగడంతో వేల్ మురుగన్‌ను డీఎంకే పక్కన పెట్టింది. కూటమి నుంచి వైదొలగడమే కాకుండా, తాను పోటీ చేయడంలేదని వేల్ మురుగన్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఓ ఈమీడియాతో మాట్లాడుతూ, డీఎంకే పై విరుచుకు పడ్డారు. నెయ్వేలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్న తనకు సీట దక్కలేదన్నారు. తనను ఒక ఎమ్మెల్యేగా కూడా గౌరవించకుండా బన్రూటిలో డీఎంకే నేతలు అవమానిస్తూ వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా వారే పాల్గొనే వారని మంత్రులయితే, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం ఆవేదన కలిగించిందన్నారు. ధర్మపురిలో సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా పోటీ చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, ఇందుకు తాను ఒప్పుకోలేదన్నారు. తనకు గౌరవం లేని చోట ఉండలేనని బయటకు వచ్చానన్నారు. అందుకే చిన్న పార్టీలతో పోటీకి సిద్దమయ్యామన్నారు. తమిళనాడు అంతటా 234 నియోజకవర్గాల్లో తన పార్టీ ప్రభావం చూపుతుందని, 40 చిన్న పార్టీలు తమతో ఉన్నాయని వేల్ మురుగన్ వివరించారు.
విజయ్ ఎన్నికల
అఫిడవిట్‌లో మార్పులు
అదనపు పత్రాల సమర్పణ
సాక్షి, చైన్నె : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న టీవీకే అధినేత విజయ్ తన నామినేషన్ ప్రక్రియలో తలెత్తిన చిన్న సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన తరపు న్యాయవాదులు శనివారం సవరించిన అదనపు అఫిడవిట్‌ను సమర్పించినట్టు సమాచారాలు వెలువడ్డాయి.
సవరణకు ఇదే కారణాలు
విజయ్ చైన్నె పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పెరంబూరులో విజయ్ తన అభ్యర్థి త్వ వివరాలను సమర్పించినప్పుడు, గతంలో ఆయనపై నమోదైన కొన్ని కేసుల వివరాలను పేర్కొనడంలో స్పష్టత కొరవడిందన్న చర్చ ఊపందకుంది. గత ఏడాది ఆగస్టులో మధురై ప్రచార సమయంలో నమోదైన కేసు, ఈ ఏడాది మార్చి 30న పెరంబూర్‌లో ప్రచార సమయంలో నమోదైన కేసు వివరాలను సరిగ్గా పొందుపరచకపోవడం వల్ల నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని వార్తలు రావడంతో, టీవీకే వర్గాలు అప్రమత్తమయ్యాయి.
అదనపు అఫిడవిట్
నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా ఉండటానికి, విజయ్ తరపున ఉత్తర చైన్నె జిల్లా కార్యదర్శి శివ , పార్టీ న్యాయవాదుల బృందం సాయంత్రం 6 గంటలకు పెరంబూర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి సవరించిన అదనపు అఫిడవిట్‌ను అందజేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఈ అదనపు పత్రాల సమర్పణతో విజయ్ నామినేషన్ విషయంలో ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు ఉండవని, ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఖాయమని టీవీకే వర్గాలు స్పష్టం చేశాయి.


