భూలోక వైకుంఠంలో రసవత్తర సమరం | - | Sakshi
Sakshi News home page

భూలోక వైకుంఠంలో రసవత్తర సమరం

Apr 3 2026 7:32 AM | Updated on Apr 3 2026 7:32 AM

సాక్షి, చైన్నె: కావేరి, కొల్లిడం నదుల మధ్యలో చిన్న ద్వీపకల్పంగా తిరుచ్చి జిల్లాలో శ్రీరంగం నియోజకవర్గం ఉంటుంది. భూలోక వైకుంఠంగా పిలువబడే శ్రీ రంగనాథ స్వామి ఆలయం, పంచభూత స్థలాలలో నీటి స్థలమైన తిరువానైకావల్‌ జంబుకేశ్వర ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇక్కడ ప్రధాన వృత్తి ప్రజలకు వ్యవసాయం. ఇక్కడ వరి అరటి, చెరకు, పువ్వుల సాగుబడి ఎక్కువ.

రాజకీయ ప్రాముఖ్యత

దివంగత సీఎం జె. జయలలిత గతంలో ఇక్కడ నుండి పోటీ చేసి గెలిచారు. ఇక్కడ ఇప్పటి వరకు అన్నాడీఎంకే తొమ్మిది, కాంగ్రెస్‌ నాలుగు, డీఎంకే రెండు సార్లు గెలిచాయి. 1996 తదుపరి ఇక్కడ డీఎంకే గెలవ లేదు. రెండు దశాబ్దాలుగా అన్నాడీఎంకే వరుస విజయాలతో దూసుకొచ్చింది. చివరకు 2021 ఎన్నికలలో డీఎంకే అభ్యర్థి ఎం. పళనియాండి 19,915 ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి కు.ప. కృష్ణన్‌పై విజయం సాధించారు. దీంతో అన్నాడీఎంకే కోటను డీఎంకే బద్దలు కొట్టింది.

సిట్టింగ్‌కు సీటు కరువు

ప్రస్తుత ఎన్నికలలో డీఎంకే తన సిట్టింగ్‌ ఎమ్మెల్యే పళనియాండికి అవకాశం ఇవ్వలేదు. ఆయనకు బదులుగా ఎస్‌ దురై రాజ్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక అన్నాడీఎంకే అభ్యర్థిగా ఆర్‌ మనోహరన్‌, తమిళగ వెట్రి కళగం(టీవీకే) అభ్యర్థిగా రమేష్‌,నామ్‌ తమిళర్‌ కట్చి(ఎన్‌టీకే) అభ్యర్థిగా ఎం ధర్మరాజ్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ ఓటర్ల సంఖ్య 2,83,862 మంది ఉన్నారు. వీరిలో పురుషులు– 1,37,694, సీ్త్రలు – 1,46,120, ఇతరులు 48 మంది ఉన్నారు. ఇక్కడ పోటీలో ఉన్న నలుగురు కొత్త ముఖాలే. తమ సిట్టింగ్‌ స్థానం చేజారకుండా డీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. మంత్రులు కేఎన్‌ నెహ్రూ, అన్బిల్‌ మహేశ్‌లు పూర్తి బాధ్యతను తీసుకుని ముందుకు సాగుతున్నారు. అలాగే తమ చేజారిన కోటను తిరిగి కై వసం చేసుకునేందుకు అన్నాడీఎంకే ఉరకలు తీస్తోంది. ఇక టీవీకే, నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థులు సైతం యువకులు కావడం గమనార్హం. ఒక్క చాన్స్‌ కోసం నాలుగు కొత్త ముఖాలు ఓట్ల వేటలో దూసుకెళ్తుండటంతో సమరం రసవత్తరంగా మారింది. భూ లోక వైకుంఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందో వేచి చూడాల్సిందే.

ఓటర్ల ప్రధాన డిమాండ్లు

● శ్రీరంగం, తిరువానైకావల్‌ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూమి హక్కుల సమస్యను పరిష్కరించే వారికే ఓటు వేస్తామని ప్రజలు ఓటర్లు స్పష్టం చేస్తున్నారు.

● వరి, అరటికి గిట్టుబాటు ధర లభించడం లేదన్న ఆగ్రహంతో రైతులు ఉన్నారు. ఇందుకు పరిష్కారం ఎవరు చూపిస్తారో ఎ దురు చూస్తున్నారు.

● మల్లెపూల సాగు ఎక్కువగా ఉన్నందున ఇక్కడ ఒక ‘సెంట్‌ ఫ్యాక్టరీ’ (సుగంధ ద్రవ్యాల కర్మాగారం) ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

● కావేరి, కొల్లిడం నదుల మధ్య మరిన్ని చెక్‌ డ్యామ్‌లు నిర్మించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement