రాజధాని నగరం చైన్నె నడి బొడ్డున ఉన్న చేపాక్కం–ట్రిప్లికేన్ నియోజకవర్గం డీఎంకే కంచుకోట. ఇక్కడి నుంచి డీఎంకే వారసుడు, డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడ్డారు. ఆయన్ని ఢీకొట్టే దిశగా ముగ్గురు అభ్యర్థులు రేసులో ఉన్నారు. ఇందులో మైనారిటీ ఓట్ల లక్ష్యంగా ఎన్‌టీకే మహిళా అభ్యర్థిని రంగంలోకి దించింది.
సాక్షి, చైన్నె : చైన్నె నగరంలోని అత్యంత ప్రముఖ ప్రాంతాలను తనలో విలీనం చేసుకున్న నియోజకవర్గం చేపాక్కం–ట్రిప్లికేన్. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చేపాక్కం– ట్రిప్లికేన్ పేర్లును కలుపుతూ ఈ నియోజకవర్గం ఆవిర్భవించింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెరీనా బీచ్, ఎం.ఏ. చిదంబరం క్రికెట్ స్టేడియం, మద్రాస్ యూనివర్సిటీ , చారిత్రాత్మక పార్థసారథి ఆలయం వంటివి ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి.
అధికార పార్టీకి కంచుకోట
ఈ నియోజకవర్గం పరిధి దశాబ్దాలుగా డీఎంకే కంచుకోటగా ఉంది. గతంలో దివంగత డీఎంకే అఽధినేత కరుణానిధి హ్యాట్రిక్ విజయం కొట్టారు. 1996, 2001, 2006 ఎన్నికల్లో ఇక్కడి నుండి గెలిచారు. రెండు సార్లు ఇక్కడి నుంచి గెలిచే సీఎంగా వ్యవహరించారు. 2011, 2016లో ఇక్కడి నుంచి దివంగత ఎమ్మెల్యే జె. అన్భళగన్ గెలిచారు. అందుకే ఈ నియోజకవర్గం డీఎంకే కంచుకోటగా ఉంటోంది.
వారసుడి అరంగ్రేటం
డీఎంకేలో కరుణానిధి తదుపరి ఆయన వారసుడు ఎంకే స్టాలిన్ రాజకీయ చక్రం తిప్పడంలో సఫలీకృతులయ్యారు. ఆయన వారసుడు ఉదయనిధి స్టాలిన్ రాజకీయ ప్రస్తానం 2021లో చేపాక్కం–ట్రిప్లికేన్ నుంచే మొదలైంది.గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగుర వేసిన ఆయన కొంత కాలానికి మంత్రి అయ్యారు. ఆ తదుపరి డిప్యూటీ సీఎంగా, డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శిగా అవతరించారు.
చతుర్ముఖ పోటీ
ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో చతర్ముఖ సమరం నెలకొంది. డిప్యూటీ సీఎం, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్ మళ్లీ రంగంలోకి దిగారు. ఇక, ఆయన్న ఢీ కొట్టే విధంగా అన్నాడీఎంకే సీనియర్ నేత ఆది రాజారామ్ పోటీ చేస్తున్నారు. ఇక, విజయ్ పార్టీ తమిళగ వెట్రికళగం(టీవీకే) అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి బయటకు వచ్చిన డి సెల్వం ఢీ కొడుతున్నారు. ఇక ఈ నియోజకవర్గం పరిధిలో మైనారిటీ ఓటు బ్యాంక్ మరీ ఎక్కువే. అందుకే ఈ ఓటర్లను గురి పెట్టి నామ్ తమిళర్ కచ్చి (ఎన్‌టీకే) ఆయేషా బేగంను అభ్యర్థిగా పోటీలో పెట్టింది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు– 1,63,866 ఉన్నారు. వీరిలో పురుషులు – 79,412 మహిళలు– 84,396, ఇతరులు 58 మంది ఉన్నారు. ఇక్కడ జాలర్లు, మైనారిటీ ఓటు బ్యాంక్ విజేతలను నిర్ణయించనున్నాయి. వీరితో పాటు తెలుగు మాట్లాడే ప్రజలు, బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా గణనీయంగా ఉన్నారు. ఇక్కడ డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ప్రదాన సమరం ఇక్కడ ఉన్నప్పటికీ, టీవీకే, ఎన్‌టీకేలు ఓట్లను గణనీయంగా చీల్చే అవకాశాలు ఉండటంతో స్టార్ నియోజకవర్గంలో సమరం హోరాహోరీ కానుంది.
వ్యూహాలకు ఆది రాజారాం పదును
ఆది రాజారామ్ ను అభ్యర్థిగా నిలబెట్టి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తన వ్యూహాలకు ఇక్కడ పదును పెట్టారు. ఉదయ నిధికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఆదిరాజారామ్ రేసులో ఉన్నారు. ఆది రాజారామ్ గత 40 ఏళ్లుగా చైన్నె రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తలతో ఆయనకు బలమైన సంబంధాలు ఉన్నాయి. 2006లో థౌజండ్ లైట్స్‌లో, 2021లో కొళత్తూరులో నియోజకవర్గాలలో ప్రస్తుత సీఎం స్టాలిన్‌ను ఢీకొట్టారు. ఓడినా, తన బలాన్ని చాటుకున్నారు. గతంలో ఓడినా, ఈ సారి మాత్రం గెలుపు తథ్యమన్నట్టుగా ధీమాతో ఉన్నారు. అయితే, 2021 ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ, ఈసారి మెజారిటీ తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందుకు కారణం అన్నాడీఎంకే బలమైన అభ్యర్థిని నిలబెట్టడం , నటుడు విజయ్ టీవీకే తో పాటు సీమాన్ ఎన్‌టీకే కూడా బరిలో ఉండటంతో ఓట్లు చీలిపోయే అవకాశం ఎక్కవగానే ఉందంటున్నారు.


