సాక్షి, చైన్నె : డీఎంకే కూటమి, తమ అభ్యర్థులకు మద్దతుగా డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ ప్రచార బాట పట్టారు. ఆమె ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్‌ను బుధవారం డీఎండీకే కార్యాలయం విడుదల చేసింది. బుధవారం తిరుత్తణిలో పార్టీ అభ్యర్థి కృష్ణమూర్తికి మద్దతుగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. 2వ తేదిన పల్లావరంలో పార్టీ అభ్యర్థి మురుగేషన్‌కు మద్దతుగా, 3వ తేదీన పార్టీ అభ్యర్థి ప్రతాప్‌కు మద్దతుగా, 4వ తేదీన పోలూరులో పార్టీ అభ్యర్థి శరవణన్‌కు మద్దతుగా, 5వ తేదీన మైలంలో పార్టీ అభ్యర్థి వెంకటేషన్‌కు మద్దతుగా , 6వ తేదీన తాను పోటీచేస్తున విరుదాచలంలో ప్రేమలత విజయకాంత్ ప్రచారం నిర్వహించనున్నారు. అలాగే 10న ధర్మపురిలో పార్టీ అభ్యర్థి ఇలంగోవన్, 11న ఓమలూరులో ఏఆర్ ఇలంగోవన్, 12న సేలం వెస్ట్‌లో అలగాపురం మోహన్ రాజ్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఆయా తేదీలలో ఆ పరిసరాలలోని కూటమి పార్టీల అభ్యర్థులకు సైతం మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లనున్నారు. విరుదాచలంలో 6వ తేదీ, ఆ తదుపరి ఏప్రిల్ 13, 14 తేదీల్లో, ఏప్రిల్ 18 నుండి 21 వరకు ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 15న చైన్నెలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో డీఎండీకే అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తారు. విజయ ప్రభాకరన్ కోసం: తన కుమారుడు విజయ ప్రభాకరన్ పోటీ చేస్తున్న విరుదునగర్ నియోజకవర్గంలో ఏప్రిల్ 16, 17 తేదీల్లో ప్రేమలత ప్రచారం నిర్వహించనున్నారు. విజయకాంత్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, డీఎండీకే ఉనికిని చాటుకోవడమే లక్ష్యంగా ఆమె షెడ్యూల్ రూపొందించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.


