సాక్షి, చైన్నె : మదురై సెంట్రల్ నియోజకవర్గంలో తానే అభ్యర్థి అని సినీ నటుడు, దర్శకుడు సుందర్.సి ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంలో పోటీ చేయనున్నట్టు పేర్కొన్నారు. పుదియ నీతి కట్చి తరపున ఆయన ఇక్కడ పోటీ చేయనున్నారన్న సమాచారాలు వెలువడ్డ విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో బుధవారం తన పోటీని సుందర్ సీ ధృవీకరించారు.
మధురైలోనే నివాసం
అన్నాడీఎంకే కూటమిలో పుదియ నీతి కట్చికి ఈ స్థానం కేటాయించారని, ఇక్కడ తానే అభ్యర్థి అని స్పష్టం చేశారు. మధురై ప్రజలు తనకు ఖచ్చితంగా విజయాన్ని అందిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇకపై నెలలో కనీసం 15 రోజులు తాను మధురైలోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటాను అని ఆయన ప్రకటించారు. ఇందు కోసం ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయాలను అందుకున్నానని, తన రాజకీయ భవిష్యత్తు, తదుపరి అడుగులు ఈ ఎన్నికల ఫలితాలపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు.
విజయ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు
నటుడు విజయ్ రాజకీయ పార్టీ ’తమిళగ వెట్రి కళగం’ గురించి అడిగిన ప్రశ్నకు సుందర్ సి. హుందాగా సమాధానమిచ్చారు: విజయ్ అంటే తనకు చాలా గౌరవం అని, ఆయనకు కూడా నాపై అంతే గౌరవం చూపిస్తారన్నారు. తన భార్య ఖుష్బూ విజయ్‌ను తన తమ్ముడిగా భావిస్తారన్నారు. విజయ్ కూడా ఆమెను అక్కలా చూస్తారని అని చెప్పారు. కుటుంబపరమైన అనుబంధం ఉన్నందున విజయ్ గురించి కానీ, ఆయన పార్టీ గురించి కానీ ఎటువంటి విమర్శలు చేయడానికి తాను సిద్ధంగా లేనని సుందర్ సి. స్పష్టం చేశారు.. అయితే రాజకీయంగా మాత్రం మధురై సెంట్రల్‌లో ప్రధాన పోరు డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్నికల నేపథ్యంలో..
మధురై సెంట్రల్ స్థానంలో సుందర్ సి., ప్రస్తుత మంత్రి , డీఎంకే సీనియర్ నేత పి.టి.ఆర్. పళనివేల్ త్యాగరాజన్‌ను ఢీ కొట్టనున్నారు. గ్లామర్ , రాజకీయ అనుభవం మధ్య జరగనున్న ఈ పోరు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
త్వరలోనే సుందర్ సి. తన నియోజకవర్గంలో ప్రచార పర్వాన్ని ప్రారంభించనున్నారు. మధురై సెంట్రల్ నుండి పోటీతో తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు సుందర్ సి. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మధురై సెంట్రల్ పోటీ చేస్తూ, ఎన్నికల ప్రచారంతో ఓటర్లకు చేరవయ్యేందుకు సిద్ధమయ్యారు. ఆయన సతీమణి, నటి , బీజేపీ ఉపాధ్యక్షురాలు కుష్భు తన భర్త సుందర్ సి గెలుపు కోసం నియోజకవర్గంలో తిష్ట వేయడం ఖాయంగా కనిపిస్తోంది.


