క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 30 2026 8:38 AM | Updated on Mar 30 2026 8:38 AM

● ఇంటిలో దాచి ఉంచిన ● ఓటర్లకు పంచడానికే ఉంచారా? అనే కోణంలో విచారణ అంబత్తూరులో అర్ధరాత్రి కలకలం పిల్లలపై ప్రత్యేక నిఘా అవసరం కార్మికుడి అనుమానాస్పద మృతి ప్రియదర్శిని గోవింద్‌కు నాట్య కళాసారథి బిరుదు ప్రదానం

రూ. 1.22 కోట్లు స్వాధీనం

తిరువొత్తియూరు: మొగప్పేర్‌ ప్రాంతంలో కొరట్టూరు పోలీసులు శనివారం అర్ధరాత్రి గస్తీ నిర్వహించారు. గోల్డెన్‌ కాలనీ ప్రాంతంలోని ఒక ఇంటి వాకిలి వద్ద నిలబడి ఉన్న ఉత్తర రాష్ట్రానికి చెందిన యువకుడు పోలీసులను చూడగానే తన చేతిలో ఉన్న సంచిని కింద పడేసి పారిపోయాడు. పోలీసులు ఆ సంచిని తనిఖీ చేయగా, అందులో కట్టల కట్టలుగా నగదు ఉంది. ఈ విషయంపై గస్తీలో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ దళానికి తెలియజేశారు. దీంతో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి అముద నేతృత్వంలో అధికారులు, పోలీసులు ఆ ప్రాంతంలోని మంజునాథన్‌ అనే వ్యక్తి ఇంటిలోకి వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో అక్కడున్న 2 సంచులు మొత్తం కట్టల కట్టలుగా కరెన్సీ నోట్లు ఉంది.మొత్తం రూ. 1 కోటి 22 లక్షల 78 వేల నగదు ఉంది. ఈ డబ్బుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని అంబత్తూరులోని ప్రభుత్వ ఖజానాలో అప్పగించారు. దీనిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అంబత్తూరులో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులచే రూ. 1.22 కోట్లు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది.

తిరువళ్లూరు: పిల్లలపై తల్లిదండ్రులు తరచూ నిఘా వుంచాలని ఆర్‌ఎంకే విద్యాసంస్థల ఛైర్మన్‌ ఆర్‌ఎస్‌ మునిరత్నం సూచించారు. తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్‌ఎంకే పాఠశాలలో కేజీ విద్యార్దులకు పట్టాలు అందజేసే కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. కార్యక్రమానికి ప్రిన్సిపల్‌ చంద్రక ప్రసాధ్‌ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఛైర్మన్‌ ఆర్‌ఎస్‌ మునిరత్నం హాజరై ప్రసంగించారు. చిన్నపిల్లలకు సెల్‌ఫోన్‌ ఇచ్చి వారిని భానిసలుగా చేయవద్దని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు తెరవెనుక ఏం చేస్తున్నారో పర్యవేక్షించాలని, సెల్‌ఫోన్‌ లాంటి పరికరాలను నూతన పరిశోధనలు, అభ్యసనం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ఛైర్మన్‌ ఆర్‌ఎం కిషోర్‌, సలహదారుడు పళనీస్వామి పాల్గొన్నారు.

తిరువొత్తియూరు: చైన్నె పశ్చిమ మాంబళం, బరోడ వీధిలో 4 అంతస్తుల కొత్త భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ బెంగళూరుకు చెందిన శబరి ( 45) స్నేహితులతో కలిసి ఉంటూ కార్పెంటర్‌ పని చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పక్కనే ఉన్న భవనంలో శబరి అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించాడు. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన ఇంటి యజమాని అశోక్‌ నగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శబరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో జరిగిన గొడవలో ఎవరైనా అతన్ని తోసి చంపారా? అనే కోణాలతో సహా పలు కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ ప్రాంతంలోని నిఘా కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

సాక్షి, చైన్నె: చైన్నె నగరంలో శ్రీ పార్థసారథి స్వామి సభ ఆధ్వర్యంలో గత 60 రోజులుగా సాగిన భారత నృత్య ఉత్సవం ఘనంగా ముగిసింది. ఆళ్వార్‌ పేటలోని నారద గాన సభలో జరిగిన ముగింపు వేడుకల్లో ప్రముఖ భరతనాట్య విద్వాంసురాలు ప్రియదర్శిని గోవింద్‌కు ప్రతిష్టాత్మకమైన ‘నాట్య కళాసారథి’ బిరుదును ప్రదానం చేశారు.ఈ సభ 126వ వార్షికోత్సవంలో భాగంగా జనవరి 3న ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో సుమారు 144 నృత్య ప్రదర్శనలు జరిగాయి. భారతీయ శాసీ్త్రయ నృత్య సంప్రదా యాలకు ప్రతిబింబంగా నిలిచిన ఈ వేడుకల్లో 200 మందికి పైగా కళాకారులు, విద్యార్థులు, 77 మంది ప్రముఖ గురువులు పాల్గొన్నారు.

గౌరవ సత్కారం: భారతీయ శాసీ్త్రయ నృత్య రంగానికి ప్రియదర్శిని గోవింద్‌ చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. వారితో పాటు మరికొందరు విద్వాంసులకు కూడా సర్టిఫికెట్లను అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి నల్లి కుప్పుస్వామి శెట్టి అధ్యక్షత వహించగా, ప్రముఖ నృత్యకారిణులు సుధారాణి రఘుపతి, మీనాక్షి చిత్తరంజన్‌ తదితరులు పాల్గొని ప్రసంగించారు.సభ ముగింపు సందర్భంగా శ్రీదేవి నృత్యాలయ బృందం, షీలా ఉన్నికృష్ణన్‌ కొరియోగ్రఫీలో ‘ఏకాదశ విష్ణుం’ అనే అద్భుత నృత్య రూపకాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement