తమిళసినిమా: మంగాత్తా చిత్ర కాంబో రిపీట్ కానుందా? అంటే కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే బదులే వస్తోంది. నటుడు అజిత్, దర్శకుడు వెంకట్ ప్రభులది హిట్ కాంబినేషన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో 2010లో తెరకెక్కిన మంగాత్తా చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ చిత్రంలో నటుడు అజిత్‌ను విలనిజంతో కూడిన స్టైలిష్ పాత్రలో చూపించి సక్సెస్ అయ్యారు దర్శకుడు. దీంతో వీరి కాంబినేషన్ మరో చిత్రం ఎప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు రానుందన్నది తాజా సమాచారం. దర్శకుడు వెంకట్ ప్రభు నటుడు శివకార్తికేయన్ హీరోగా చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని నటుడు శివకార్తికేయన్ కూడా తెలిపారు. అయితే ఈ చిత్రం ప్రారంభంలో ఆలస్యం జరగనున్నట్లు తెలిసింది. దీంతో దర్శకుడు వెంకట్ ప్రభు ఇటీవల నటుడు అజిత్‌ను కలిసి కథ వినిపించినట్లు, అది ఆయనకు నచ్చడంలో అందులో నటించడానికి సమ్మతించినట్లు సమాచారం. కాగా అజిత్ 2027 జనవరి వరకు చిత్రాల్లో నటించనని ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆయన 64వ చిత్రాన్ని గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. దీంతో వెంకట్ ప్రభు దర్శకత్వంలో అజిత్ నటించే చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందీ? దానికి సంబంధించిన వివరాలు ఏమిటి? అన్నది తెలియాలంటే మరికొద్ది కాలం ఆగాల్సిందే. ఇకపోతే ఇది మాంగాత్తాకు సీక్వెల్‌గా ఉంటుందా? లేక కొత్త కథా చిత్రంగా ఉంటుందా? అనే ఆసక్తి నెలకొంది.
దర్శకుడు
వెంకట్‌ప్రభు,
అజిత్


