–రచయిత్రి, వక్త బులుసు నవీన
కొరుక్కుపేట: పట్టుదల అంటూ ఉంటే ఏ భాషైనా సొంతగా నేర్చుకోవచ్చునని ప్రముఖ రచయిత్రి, వక్త బులుసు నవీన అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు వేద విజ్ఞాన వేదిక తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధరావహికలో భాగంగా 171వ ప్రసంగంగా సంస్కతంలో చమత్కారం అనే అంశంపై ఉపన్యాస కార్యక్రమం ఆదివారం రాత్రి ఆంధ్రా క్లబ్ లో జరిగింది.వక్తగా అనువాదకురాలు, ప్రముఖ రచయిత్రి బులుసు నవీన విచ్చేసి ఉపన్యాసం అందించారు. ఆమె మాట్లాడుతూ... పట్టుదల అంటూ ఉంటే ఏ భాషైనా సొంతగా నేర్చుకోవచ్చు. అలాగే నేను తెలుగు నేర్చుకున్నా, సంస్కత సాహిత్యం సాగరం వంటిదన్నారు. వైమానిక, గణిత వంటి ఎన్నో శాస్త్రాలు, అనేక కావ్యాలు ఇందులో భాగం అని అన్నారు. విషయాన్ని అందంగా చెప్పడం కావ్యాలకే చెల్లింది. కొన్ని పొడుపు కథలను కూడా నవీన ప్రస్తావించి ఆకట్టుకున్నారు.. కవులు అత్యంత చమత్కారంగా పూరించిన కొన్ని సమస్యలను వివరించటం ప్రత్యేకంగా నిలిచింది. శివుడు గుణమనే చంద్రుడిని తలపై పెట్టుకొని విషాన్ని కంఠంలో దాచుకున్నట్టు కవులు గుణ దోషాలను స్వీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా కార్యదర్శి కందనూరు మధు స్వాగతోపన్యాసం చేయగా, వక్త నవీనాను జేకే రెడ్డి సభకు పరిచయం చేసి ఘనంగా సత్కరించారు.తెలుగు సాహితీ ప్రియులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


