స్టాలిన్ ఆశీస్సులు
కూటమిలో 10 మంది ముస్లిం అభ్యర్థులు
తాంబరంలో అసమ్మతి
సీపీఐ జాబితా విడుదల
సాక్షి, చైన్నె: సీట్ల సర్దుబాటు, నియోజకవర్గ కేటాయింపు ప్రక్రియతో అభ్యర్థులు అన్నా అరివాల యం వైపుగా క్యూ కడుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్‌ను మిత్ర పక్షాల అభ్యర్థులు ప్రసన్నం చేసుకుని ఆశీస్సులు అందుకుంటున్నారు. వివరాలు.. అధికార డీఎంకే తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిత్రులకు సీట్లు కేటాయించింది. వారు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో పడ్డారు.
మైనారిటీలకు పెద్దపీట
డీఎంకే కూటమి తరపున ఈసారి 10 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 8 మంది డీఎంకే గుర్తు ఉదయ సూర్యుడిచిహ్నంలో పోటీ చేస్తున్నారు. ఇందులో ఆవడి నుండి మంత్రి ఎస్.ఎం. నాజర్, సెంజి నుండి మాజీ మంత్రి కె.ఎస్. మస్తాన్, పాళయంకోట్టై నుండి అబ్దుల్ వహాబ్, రాయపురం నుండి సుబేర్ ఖాన్‌లు డీఎంకే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక, కూటమిలోని మనిద నేయమక్కల్ కట్చి తరపున జవాహిరుల్లా (నాగపట్నం, అబ్దుల్ సమద్ (మనప్పారై) పోటీలో ఉన్నారు. అలాగే ఎస్‌డిపిఐ తరపున నన్నిలం నుండి నెల్‌లై ముబారక్ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక, ఐయూఎంఎల్ తరపున షాజహాన్ (పాపనాశం), సయ్యద్ ఫరూక్ (వాణియంబాడి) నిచ్చెన గుర్తుపై పోటీ చేస్తున్నారు.
సిపిఐ, ఎండీఎంకే అభ్యర్థుల జాబితా విడుదల
డీఎంకే కూటమిలో 5 స్థానాలు దక్కించుకున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తన అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తిరుతురైపూండి: మరిముత్తు, తలి టి.రామచంద్రన్, తిరుప్పూర్, రవి, శ్రీవిల్లిపుత్తూరు: మహాలింగం, భవానీ సాగర్: సుందరం పోటీ చేస్తున్నారు. ఇక, ఎండీఎంకే సైతం అభ్యర్థులను ప్రకించింది. ఇందులో మోడకురిచ్చి– సెంథిల్ నాథన్, మదురై దక్షిణం– భూమినాథన్, కడయనల్లూరు – డీఎం రాజేంద్రన్‌లు డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేయనున్నారు. సిర్కాళి – సెంథిల్ సెల్వన్ మాత్రంప్రత్యేక చిహ్నంలో పోటీచేస్తారని ఎండీఎంకే నేత వైగో ప్రకటించారు. ఇప్పటికే డీఎండీకే తన అభ్యర్థులను ప్రకటించింది. డీఎండీకే, ఎండీఎంకే అభ్యర్థులతో పాటూ డీఎంకేకు చెందిన అభ్యర్థులు అనేక మంది అన్నా అరివాయలం వైపుగా క్యూ కట్టారు. స్టాలిన్ ఆశీస్సులు అందుకున్నారు.
తాంబరం డీఎంకేలో అసమ్మతి సెగ
అభ్యర్థుల ప్రకటన డీఎంకేలో కొన్ని చోట్ల అసమ్మతికి దారితీసింది. తాంబరం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.ఆర్. రాజాకు ఈసారి టికెట్ నిరాకరించడం కలకలం రేపింది. ఆయన స్థానంలో డాక్టర్ కృతికా దేవిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఎంపీ టీఆర్ బాలు నివాసాన్ని ముట్టడించిన నిరసనకారులు తదుపరి చైన్నెలోని పార్టీ ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. స్థానిక నేతను కాదని బయటి వ్యక్తికి సీటు ఇవ్వడం ఏంటి? అంటూ నినాదాలు చేశారు. కాగా, తనకు సీటు రాక పోవడంతో టీ నగర్ డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే కరుణానిధి తన పదవికి రాజీనామా చేశారు.
స్టాలిన్ ఎన్నికల ప్రచారం ఖరారు
ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ నెల 31వ తేదీ నుండి తన సుడిగాలి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. తిరువారూర్‌లో ఈ ప్రచారం మొదలు కానున్నది. ఏప్రిల్ 1– తిరుచ్చి, కరూర్ జిల్లాల్లో , 2న ఈరోడ్, కోయంబత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఇక, డీఎంకే కూటమిలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కుస్తీ ఢిల్లీ వేదికగా జరుగుతోంది. ఇక, వీసీకే తన అభ్యర్థుల జాబితా తయారీలో నిమగ్నమైంది.


