తిరువొత్తియూరు: తిరువారూర్‌లో వెలిసిన త్యాగ రాజ స్వామి ఆలయంలో రథోత్సవం (ఆళిత్తేరోట్టం) ఆదివారం కోలాహలంగా జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరువారూరు త్యాగరాజ స్వామి ఆలయం శైవ మతానికి ప్రధాన పీఠంగానూ, ఇచ్చట జన్మించిన వారికి ముక్తినిచ్చే స్థలంగానూ, నాయనార్లు తమ కీర్తనలు వినిపించిన స్థలంగా విలసిల్లుతోంది. ఆలయంలో మూల విరాట్ వన్మీకనాథుడు, ఉత్సవమూర్తిగా త్యాగరాజు ఉన్నారు. ఈ ఆలయంలో వున్న రథం ఆసియా ఖండంలోనే అతి పెద్ద తేరు (రథం) అని పిలువబడుతోంది. ఆళి అంటే సముద్రమంత పెద్దది అని అర్థం. ఈ సంవత్సరం పంగుణి ఉత్తర బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీన ధ్వజరోహనంతో ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రతిరోజూ స్వామికి ప్రత్యేక అభిషేక, ఆరాధనలు, ఉత్సవ మూర్తి నాలుగు మాడ వీధి ఉత్సవాలు జరుగుతూ వచ్చాయి. ముఖ్యమైన ఉత్సవమైన ఆళిత్తేరోట్టం రథోత్సవం ఆదివారం (29వ తేదీ) ఘనంగా నిర్వహించారు.
చైన్నె మైలాపూరులో రథోత్సవం
చైన్నె మైలాపూరు కపాలీశ్వర స్వామి ఆలయంలో పంగుణి బ్రహ్మోత్సవాల ను పురస్కరించుకుని ఆదివారం ఘనంగా రథోత్సవం నిర్వహించారు. అ అలాగే కాంచీపురం ఏకాంబరం స్వామి ఆలయంలోనూ పంగుని ఉత్తరం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం రథోత్సవం చేపట్టారు.


