తిరుత్తణి: ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకల్లో భాగంగా శుక్రవారం అమ్మవారు కాశినాథపురంలో ఊరేగారు. ఈ సందర్భంగా భక్తులు తమ శరీరానికి ఇనుప చువ్వలు గుచ్చుకుని అమ్మవారి వాహనం లాగి మొక్కులు తీర్చుకున్నారు. తిరుత్తణి గాంధీ రోడ్డులోని ద్రౌపదీదేవి ఆలయంలో వార్షిక అగ్నిగుండ వేడుకలకు గురువారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. 18 రోజులపాటు నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా రెండవ రోజు వేకువజామున ధర్మరాజుకు విశేష పూజలు నిర్వహించారు. ఉదయం ద్రౌపదీదేవికి విశిష్ట అలంకరణ చేసి ట్రాక్టర్‌లో కొలువుదీర్చారు. కాశినాథపురం గ్రామానికి చెందిన యువకులు తమ శరీరానికి ఇనుప చువ్వలు గుచ్చుకుని ట్రాక్టర్‌లో వేలాడుతూ, లాగుతూ గ్రామంలోకి అమ్మవారిని తరలించారు. గ్రామీణులు అమ్మవారికి హారతులిచ్చి కొబ్బరికాయలు కొట్టి దర్శించుకున్నారు.


