– డీఎంకే కూటమిలో విస్తృతంగా మంతనాలు
సాక్షి, చైన్నె : సీట్ల సర్దుబాటు ప్రక్రియను కొలిక్కి తెచ్చినప్పటికీ, నియోజక వర్గాల ఎంపిక లో అసంతృప్తి సెగ అన్నది డీఎంకే కూటమిలో రాజుకున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. నో కాంప్రమైజ్ అంటూ డీఎంకే కఠినంగానే వ్యవహరిస్తుండటంతో కొన్ని పార్టీలు తమలోని ఆవేదనను బయటకు కక్కలేక, మింగలేక సతమతం అవుతోన్నట్టు చర్చ ఊపందుకుంది.కూటమిలో కాంగ్రెస్‌కు 28 సీట్లు, డీఎండీకేకు 10, వీసీకేకు 8, సీపీఎం 5, సీపీఐ 5, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ 2 సీట్లను దక్కించుకున్నాయి. ఈ పార్టీలన్నీ వారి వారి చిహ్నాలలో పోటీచేయనున్నాయి. అయితే, ఎండీఎంకేకు నాలుగు సీట్లు ఇచ్చినా, ఇందులోమూడు డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేసే విధంగా నిర్భంధం విదించడం గమనార్హం. మిగిలిన పార్టీలన్నీ డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేయాల్సిందే. 234 స్థానాలలో 59 స్థానాలు పైన పేర్కొన్న మిత్రులకు పోగా 175 స్థానాలలో డీఎంకే ఉదయ సూర్యుడు పోటీ చేసే విధంగా స్టాలిన్ నిర్ణయించారు. తమకు తక్కువ సీట్లు ఇవ్వడంతో సీపీఎం, సీపీఐలు లోలోపల అసంతృప్తితో ఉన్నప్పటికీ, నియోజకవర్గాల ఎంపిక విషయంలోనూ సమస్యను ఎదుర్కొంటున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. శుక్రవారం పలు దఫాలుగా నియోజకవర్గాల ఎంపిక విషయంగా డీఎంకే కమిటీతో చర్చలు జరిగాయి. అదే సమయంలో పాత మిత్రులకు తగ్గించి, కూటమిలోకి కొత్తగా వచ్చిన డీఎండీకేకు పది స్థానాలు ఇవ్వడంపై పెదవి విప్పే పనిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంలో డీఎంకే పాత మిత్రులు లోలోపల కుమిలిపోతున్నారన్నది స్పష్టం అవుతోంది.
ఇందుకు అనుగుణంగా నే ఎండీఎంకే ప్రతినిధి అర్జున రాజ్ స్పందించారు. తాము నవ్వుతూ ఏడుస్తున్నామంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. శుక్రవారం జరిగిన ఎండీంకే భేటీలో సైతం ఇదే విషయంగా నేతలు ప్రస్తావించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తమ హక్కును హరించే విధంగా డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంలో పోటీ చేసే విధంగా నిర్భందించడాన్ని మరికొన్ని చిన్న పార్టీలు సైతం మౌనంగా రోదిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. శుక్రవారం జరిగిన సుదీర్ఘ చర్చలు, మంతనాలతో కొన్ని పార్టీలకు నియోజకవర్గాలను కేటాయించారు. అలాగే,వీసీకేకు సైతం కేటాయింపు ముగించగా, మిగిలిన పార్టీలకు శనివారంలోపు పూర్తి చేయడానికి స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం తమ జట్టును స్టాలిన్ ప్రకటించే అవకాశాల ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, కాంగ్రెస్ రూపంలో నియోజకవర్గం ఎంపిక సెగ కొనసాగుతున్నట్టు అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి.


