వేలూరు: క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సబ్జెక్టు ర్యాంకింగ్స్‌లో ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగంలో వీఐటీ యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా 119వ స్థానానికి చేరుకొని ముందంజ వేసింది. ప్రపంచ ఉన్నత విద్యా విశ్లేషణ సంస్థ క్యూఎస్ క్యాక్యా రెల్లి సైమండ్స్ తన 2026 వరల్డ్ యూనివర్సిటీ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 100 విభిన్న ప్రాంతాల్లో ఉన్న 1,700కు పైగా విశ్వవిద్యాలయాల్లో అందిస్తున్న 18,300కు పైగా అకడమిక్ కార్యక్రమాల విశ్లేషించిన అనంతరం ఈ సంస్థ ఈ ఫలితాలను ప్రచురించింది. 2026 ఎడిషన్‌లో వేలూరు వీఐటీ యూనివర్సిటీ 17 విబిన్న సబ్జెక్టు విభాగాలలో ప్రపంచంలోని అగ్రగామి యూనివర్సిటీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ర్యాంకింగ్‌పై వీఐటీ యూనివర్సిటీ చాన్స్‌లర్ విశ్వనాథన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపిన విధంగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో వీఐటీ యూనివర్సిటీ గత సంవత్సరం పోలిస్తే 23 స్థానాలు ఎగబడి ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా 119వ స్థానానికి చేరుకుందని జాతీయ స్థాయిలో ఆరవ ర్యాంకును సాధించిందన్నారు. ముఖ్యంగా తమ యూనివర్సిటీ రెండు నిర్ధిష్ట విభాగాల్లో టాప్ 100 ర్యాంకింగ్స్‌లో విజయవంతంగా స్థానం సంపాదించిందన్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో 56వ ర్యాంకు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో 87వ ర్యాంకు సాధించిందన్నారు. అదేవిధంగా ఈ సంస్థ అనేక విభాగాలలో టాప్ 200 ర్యాంకింగ్స్‌లో స్థానం సంపాదించిందన్నారు. గణితంలో 104వ ర్యాంకు, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో 101–200, మెటిరియల్స్ సైన్స్‌లో 137వ ర్యాంకు, మెకానికల్, ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో 148వ స్థానం సాధించిందన్నారు. ప్రస్తుతం క్యూఎస్ ర్యాంకింగ్‌లో స్థానం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని ఆ ప్రకటనలో తెలిపారు.


