అశోక్‌నగర్‌లో
సీసీ కెమెరాల నిఘా
సాక్షి, చైన్నె: ప్రజా రక్షణను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో చైన్నె అశోక్ నగర్ వ్యాప్తంగా 100 సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్‌ను ఐసీఎల్ ఫిన్‌కార్ప్ సంస్థ ఏర్పాటు చేసింది. లయన్స్ క్లబ్, తమిళనాడు పోలీసుల సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును శుక్రవారం ప్రారంభించారు. అశోక్ నగర్ ఆర్–3 పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఐసీఎల్ ఫిన్‌కార్ప్ సీఎండీ కె.జి.అనిల్ కుమార్ ఈ నిఘా వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐసీఎల్ ఫిన్‌కార్ప్ హోల్–టైమ్ డైరెక్టర్, వైస్ చైర్మన్, సీఈఓ ఉమా అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టీనగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.కుత లింగం, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.ఆల్డ్రిన్, ఇన్‌స్పెక్టర్ ఎస్.సతీష్ కుమార్ తదితర పోలీసు ఉన్నతాధికారులు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొని సంస్థ చేస్తున్న సామాజిక సేవలను అభినందించా రు. ఆర్థిక సేవలకు మాత్రమే పరిమితం కాకుండా, సామాజిక భద్రతపై, ప్రజలు సురక్షితమైన వాతావరణంలో నివశించేలా చూడడమే లక్ష్యంగా ముందుకెళ్లడాన్ని ఆహ్వానించారు.
నకిలీ నోట్ల కేసులో
ఒకరి అరెస్ట్
అన్నానగర్: నకిలీ నోట్ల కేసులో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. నాగపట్టణం జిల్లాలోని తారగమరుదూరు ప్రాంతానికి చెందిన మురుగానందం (40). ఇతను టైలరింగ్ దుకాణం నడుపుతున్నాడు. శుక్రవారం, తానికోట్టగం కడైతేరు వద్ద పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు. బైక్‌లో వస్తున్న మురుగానందం వద్ద తనిఖీ చేయగా, అతని వద్ద నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో అతని వద్ద రూ.31,500 విలువైన నకిలీ నోట్లు ఉన్నాయని, వాటిని తన దుకాణంలో ముద్రించి చలామణికి తెచ్చాడని తెలిసింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
చిన్నప్పటి నుంచే
క్రమశిక్షణ అలవరుచుకోవాలి
వేలూరు: విద్యార్థులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని అనకట్టు బ్లాక్ విద్యాశాఖాధికారి కుమరన్ అన్నారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని మూలైకాట్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 49వ వార్షికోత్సవం, విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలను పాఠశాల హెచ్‌ఎం జోసెఫ్ అన్నయ్య అద్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అనేక వసతులున్నాయని, అయినప్పటికీ అనేక మంది కార్పొరేట్ పాఠశాలలకు ఆకర్షితులై ప్రభుత్వ పాఠశాలకు రావడం లేదన్నారు. ఇక్కడ విద్యను అభ్యసించిన అనేక మంది ఉన్నత స్థానాలకు చేరారన్నారు. అనంతరం తరగతులు పూర్తిచేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయడంతోపాటు పాఠశాలలో గ్లోబుల్ అకాడమీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నిర్వహించిన అబాకస్ పోటీల్లో 30 మందికి పైగా హాజరై చాంపియన్‌షిప్ సాధించారు. వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు. అదేవిధంగా తిరువళ్లువర్ సాహిత్య వేదిక నిర్వహించిన తిరుక్కురల్ క్విజ్ పోటీల్లో ప్రశ్నలు సమాదానాలు చెప్పిన వారికి బహుమతుల అందజేయడంతోపాటు గ్రూప్ ఫొటో తీసుకున్నారు. సర్పంచ్ సైనలత, పాఠశాల కమిటీ చైర్మన్ సెల్వరాజ్, టీచర్లు పుణిద, మహేశ్వరి, గోవిందరాజ్, బ్లాక్ రిసోర్స్ పర్వవేక్షకురాలు శాంతి తదితరులు పాల్గొన్నారు.
డివైడర్‌ను ఢీకొన్న కారు
అన్నానగర్: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నివాసి అయిన బాలేంద్ర సింగ్ తన భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడితో కలిసి కారులో తమిళనాడుకు వచ్చారు. కన్యాకుమారి జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించిన తర్వాత, వారు గురువారం సాయంత్రం రామనాథపురం మీదుగా రామేశ్వరం ఆలయానికి తిరిగి వెళ్తున్నారు. రామనాథపురం జిల్లా మండపం పక్కన ఉన్న ఉచ్చిపులి సమీపంలో పెరుంగుళం పాత టోల్ గేట్ ప్రాంతానికి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న ప్రభుత్వ బస్సు అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డంగా తిరిగింది. ఇది ఊహించని బాలేంద్ర సింగ్, బస్సును ఢీ కొనకుండా ఉండేందుకు వెంటనే కారును పక్కకు తిప్పారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి, రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బాలేంద్ర సింగ్‌తోపాటు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని రక్షించారు. రామనాథపురం ప్రభుత్వ అస్పత్రికి తరలించగా, అక్కడ బాలేంద్ర సింగ్ కుమార్తె ఆరాధ్య భద్రుల (10) చికిత్స అందక విషాదకరంగా మరణించింది. మిగిలిన నలుగురు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఉచ్చిపులి పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.


