తమిళసినిమా: కోలీవుడ్లో దూసుకొస్తున్న యువ సంగీత దర్శకుల్లో నివాస్ కె.ప్రసన్న ఒకరు. ఈయన ఇటీవల బైసన్ వంటి విజయవంతమైన చిత్రానికి సంగీతం అందించారు. ఇటీవల ఈయన సంగీతం అందించిన తాయ్ కిళవి చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ఈ చిత్రాలకు నివాస్ కె ప్రసన్న సంగీతం పక్కా బలంగా అమిరింది. కాగా తాజాగా మరో కొత్త చిత్రానికి ఈయనే కమిట్ అయ్యారు. ఇంతకు ముందు మావీరన్, 3 పీహెచ్‌కే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శాంతి టాకీస్ సంస్థ అధినేత అరుణ్ విశ్వనిర్మిస్తున్న 4వ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో భారత్, కుటుంబస్తన్ చిత్రం ఫేమ్ శాన్వేమేఘ్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిహర్‌సుదన్ అళగిరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి నివాస్ కె.ప్రసన్న సంగీతాన్ని అందిస్తున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. మంచి కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించే సంస్థగా పేరొందిన శాంతి టాకీస్ రూపొందిస్తున్న ఈ చిత్రం కూడా కథను మాత్రమే నమ్మి నిర్మిస్తున్నట్లు యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిత్ర షూటింగ్‌ను ఏకధాటిగా నిర్వహించి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. దీనికి తేనీఈశ్వర్ చాయాగ్రహణం అందిస్తున్నారు.


