– తిరుత్తణి నుంచి సీమాన్ ప్రచారం
తిరుత్తణి: తన ప్రత్యర్థి రాజకీయ పార్టీలు శూలాయుధం నమ్ముకుంటే తాను మాత్రం వేలాయుధంతో ఎన్నికల యుద్ధంలో ప్రవేశిస్తున్నట్లు నామ్ తమిళర్ పార్టీ ఆర్గనైజింగ్ ఆర్గనైజర్ సీమాన్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పొత్తులు పూర్తిచేసుకుని ఎన్నికల మెనిఫెస్టో విడుదల చేసి ప్రజల వద్దకు పార్టీలు పరుగులు తీస్తున్నాయి. ఇందులో ముందుగా నామ్ తమిళర్ పార్టీ ఒంటిరిగా పోటీ చేస్తూ 234 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ఉచిత హామీలు లేని ఎన్నికల వాగ్దానాలు విడుదల చేసి ప్రచారం సైతం ప్రారంభించారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామిని సోమవారం తన కుటుంబీకులు, పార్టీ శ్రేణులతో కలసి కాలినడకన కొండ ఆలయం చేరుకుని చేత వేల్ పట్టుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం సాయంత్రం తన తొలి ఎన్నికల ప్రచారాన్ని వాహనం నుంచి ప్రారంభించారు. ముందుగా తన ఇష్టదైవనం తమిళుల ఆరాధన దైవంగా భావించే మురుగన్ భక్తి పాట పాడి తన ప్రచారాన్ని ప్రారంభించారు. తమ ప్రత్యర్థి పార్టీలు శూలాయుధం నమ్ముకుని ఎన్నికల బరిలో వుండగా, తాను మాత్రం మురుగన్ వేలాయుధం నమ్ముకుని రాజకీయ యుద్ధంలో ప్రవేశిస్తున్నానని అన్నారు. ప్రపంచానికి విలువలు నేర్పిన తమిళజాతి నేడు కూడు, గుడ్డకు, ఉచితాల కోసం ఎదురుచూసే స్థాయికి పాలకులు తీసుకొచ్చారని మండిపడ్డారు. తమిళజాతికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకే తన పోరాటమని చెప్పారు. కచ్చితంగా అధికారంలోకి వస్తా, ఉచితాలు అంటే మా దృష్టిలో అవినీతి కేరాఫ్ అడ్రస్ అన్నారు. చివరగా ఓటర్లు తమ ఓటును ఎలా వినియోగించుకోవాలో పాట ద్వారా వివరించి ప్రచారం పూర్తి చేసుకుని షోళింగర్ నియోజకర్గానికి బయలుదేరి వెళ్లారు.


