తిరువళ్లూరు: ఇరాన్– ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఏర్పడింది. దీంతో గత వారం రోజుల నుంచి టీషాపులు, హోటల్స్ మూతపడుతున్నాయి. ఫలితంగా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలగడంతో పాటూ వందలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. వివరాలు.. తిరువళ్లూరు పట్టణంతో పాటు మనవాలనగర్, కడంబత్తూరు, పూండి, తామరపాక్కం, పేరంబాక్కం, వెంగల్, ఊత్తుకోట తదితర ప్రాంతాల్లో హోటల్స్, టీదుకాణాలు, సూప్ షాపులు వున్నాయి. వీటిల్లో నిత్యం లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతూవుంది. వందలాది మంది కార్మికులు హోటల్స్ తదితర వాటిల్లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తిరువళ్లూరు పట్టణంలో గత నెల రోజుల నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీంతో కొందరు వ్యాపారులు బ్లాక్‌లో చిన్న సిలిండర్‌లను అధిక రేటుకు కొనుగోలు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. గతంలో వెయ్యి రూపాయలు పలికిన సిలిండర్‌లు ప్రస్తుతం నాలుగు వేల రూపాయల వరకు పలుకుతూవుంది. ఎక్కువ ధరకు సిలిండర్‌లను కొనుగోలు చేసి వ్యాపారం సాగించలేక పలు హోటల్స్, టీదుకాణాలు, పాణిపూరి అంగళ్లు మూతపడ్డాయి. గ్యాస్ కొరత కారణంగా హోటల్స్ మూసివేస్తున్నట్టు వ్యాపారులు పేపర్లు అంటించారు. కాగా హోటల్స్ మూతపడిన క్రమంలో వేలాది మంది కార్మికులు జీవనోపాధిని కోల్పోయే ప్రమాధం ఏర్పడింది. అధికారులు స్పందించి ఎక్కువ రేట్లుకు గ్యాస్ సిలిండర్ అమ్మకాలు జరిపే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటూ ప్రైవేటు గ్యాస్‌సిలిండర్‌లు విరివిగా దొరికే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


