27న తమిళనాడు
వ్యాప్తంగా వ్యాపారుల నిరసన
– విక్రమరాజు హెచ్చరిక
కొరుక్కుపేట: ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ చైన్నె జోన్ జిల్లా నిర్వాహకులు, యూనియన్ నిర్వాహకుల సంప్రదింపు సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఏఎం విక్రమరాజు అధ్యక్షతన జరిగింది. ఆ తరువాత విక్రమరాజా విలేకర్లతో మాట్లాడుతూ తమిళనాడు ఎన్నికల నియమ నిబంధనల అమలు కారణంగా చిన్న సూక్ష్మ వ్యాపారుల నుంచి పెద్ద కార్పొరేషన్ల వరకు వివిధ రకాల వ్యాపారుల నుంచి వ్యాపార సంబంధిత నగదును స్వాదీనం చేసుకుంటున్నా రు. ఇందులో నగదు స్వాధీనాలు , వస్తువుల స్వాధీనాలు, బంగారం , వెండి ఆభరణాల స్వాధీనాలు, టమోటా వ్యాపారుల నుంచి డబ్బు స్వాధీనం చేసుకోవడం వంటివి ఉన్నా యి . ఈ విషయంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా సడలింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రదాన ఎన్నికల అధికారికి ఓ వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆడిట్‌లో పాల్గొన్న అధికారులు స్వాధీనం చేసుకున్న నగదు , వస్తువులను వెంటనే తిరిగి ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరు తూ ధర్నా చేపట్టనున్నామని తెలిపారు . ఎన్నికల సంఘం ,అధికారులు తమ డిమాండ్లను అంగీకరించకపోతే ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా 27న ప్రతీ జిల్లాలో తమిళనాడు ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నిరసన ప్రదర్శన లు చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
వైభవంగా కాలియమ్మన్ ఆలయ కుంభాభిషేకం
వేలూరు: వేలూరు జిల్లా కేవీ కుప్పం నియోజకవర్గం పరిధిలోని పెరియ అరుంబాక్కం గ్రా మంలో వెలసిన మహా కాలియమ్మన్ ఆలయ మహా కుంభాభిషేక వైభవం ఆదివారం అతి వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ నిర్వహకులచే శివాచార్యుల వేద మంత్రాల నడుమ యాగ శాల పూజలు, గణపతి హోమం, సూర్య హోమం, సకల దేవతా హోమం, 108 రకాల తో కూడిన వనమూళికలతో కూడిన యాగ పూజలు తదితర పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ పుణిద నదుల నుంచి తీసుకొచ్చిన నీటిని యాగ గుండంలో కళశాల్లో ఉంచి ప్రత్యేక పూజలు ప్రార్థనలు చేశారు. అనంతరం కళశాల్లో ఉంచిన నీటిని శివాచార్యులు వేద మంత్రాల నడుమ ఆలయ రాజ గోపురంపైకి తీసుకెళ్లి కళశ నీటిని పోసి కుంబాభిషేకం నిర్వహించారు.అనంతరం ఆలయంలోని మూ ల స్థానంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, పుష్పాలంకరణ, దీపారాధన పూజలు చేసి భక్తుల దర్శనార్ధం ఉంచారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
అర్ధరాత్రి మెట్రో రైలు పట్టాలు తప్పినట్లు ఫోన్ కాల్
– అగ్నిమాపక సిబ్బంది వెళ్లాక..
కొరుక్కుపేట: చైన్నె నగర రవాణాలో మెట్రో రైలు సేవలు ముఖ్య భాగంగా మారాయి. ప్రజల సౌకర్యం, భద్రత కోసం మెట్రో రైలు పరిపాలన యంత్రాంగం వివిధ చర్యలు తీసుకుంటోంది. ఈ పరిస్థితిలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో కోయంబేడు మెట్రో రైలు స్టేషన్‌లో ఓ రైలు పట్టాలు తప్పిందని అగ్నిమాపక శాఖ నియంత్రణ గదికి సమాచారం అందింది. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైన అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందిన కొద్ది నిమిషాలకే కోయంబేడు అగ్ని మాపక శాఖ అధికారి నేతృత్వంలో ఒక వాహనంలో కోయంబేడు మెట్రోరైలు స్టేషన్‌కు హుటాహుటిన చేరుకున్నారు. ఆ సమయంలో తలుపులు తాళం వేసి ఉండటంతో తలుపు తెరిచిన గార్డు సహయంతో అగ్నిమాపక సిబ్బందిపై ఫ్లాట్ ఫాంకు పరిగెత్తారు. కానీ ఫ్లాట్ ఫం మీద మెట్రో రైలు దగ్గర నిలబడి ఉన్న అధికారులు ఎలాంటి కంగారు లేకుండా కొద్ది నిమిషాల్లో యాధావిధిగా అక్కడే ఉన్నారు . అగ్నిమాపక సిబ్బంది ఈ విషయం గురించి మెట్రో రైలు అధికారులను విచారించారు. కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఎంతవేగంగా వస్తారో పరీక్షించడానికి తాము ఒక భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించామని చెప్పారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఉత్తరాది కార్మికుడి హత్య?
అన్నానగర్: చైన్నె కుండ్రత్తూరు సమీపంలో ఉన్న తిరుముడివాక్కం సిడ్కో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఆదివారం ఉదయం బిహార్‌కు చెందిన ఓ యువ కార్మికుడు రక్తపు గాయాలతో మృతదేహంగా లభ్యం కావడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. బిహార్ నివాసి అయిన అమిత్ కుమార్ (18), తిరుముడివాక్కం పారిశ్రామికవాడలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి, ఫ్యాక్టరీ సూపర్‌వైజర్ ను అతను తన సొంత ఊరికి వెళ్లాలని సెలవు కోరాడు. కానీ అతనికి సెలవు నిరాకరించారని తెలుస్తోంది. దీంతో అసంతృప్తి చెందిన అతను, ఆ రాత్రే ఫ్యాక్టరీ నుండి వెళ్లిపోయాడు. ఈ స్థితిలో ఆదివారం ఉదయం తిరుముడివాక్కం సిడ్కో ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో అమీత్ కుమార్ శరీరం పై తీవ్రమైన రక్తపు గాయాలతో మరణించి కనిపించాడు. సమాచారం అందుకున్న తిరుముడివాక్కం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పోస్ట్‌మార్టం కోసం తాంబరంలోని ప్రభుత్వ జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రికి పంపించారు. బాల కార్మిక చట్టం కింద చర్యలా? ఈ ఘటనలో పోలీసులు ప్రస్తుతం అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు.


