సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో నామినేషన్లకు సోమవారం తెర పడనుంది. ఎన్‌డీఏ కూటమిలో లెక్క తేలినా, ఇండియా కూటమిలో ఇంకా లెక్క తేలలేదు. దీంతో ఉత్కంఠ తప్పడం లేదు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ ప్రధాన సమరం అన్నది ఎన్‌డీఏ, ఇండియా కూటమి మధ్య ఉంది. అయితే,ఈ సారి పరిస్థితి మారింది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పుదుచ్చేరిలో దెబ్బ తిన్న దృష్ట్యా, ఈసారి తమ నేతృత్వంలో ఎన్నికలలోకి వెళ్లేందుకు డీఎంకే వ్యూహ రచన చేసింది. ఇందుకు అనుగుణంగా తమిళనాడు ఎంపీ, పుదుచ్చేరిలో సామాజిక, ఆర్థిక బలం కలిగిన నేత జగత్ రక్షకన్‌ను రంగంలోకి దించింది. గత ఏడాదిన్నర కాలంగా జగత్‌రక్షకన్ పూర్తిగాపుదుచ్చేరిలో తిష్ట వేసి ఎన్నికల వ్యూహాలు రచిస్తూ వచ్చారు. దీంతో పుదుచ్చేరి, డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల వివాదం రోజుల తరబడి ఉత్కంఠగా సాగుతూ వస్తోంది. డీఎంకే నేతృత్వంలో ప్రభుత్వం ఒక వేళ ఏర్పాటైన పక్షంలో జగత్ రక్షకన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేత, మాజీ సీఎం నారాయణ స్వామి సైతం పట్టువీడకుండా సీట్ల విషయంలో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు.
చివరి నిమిషం వరకు కూటమిలో సందిగ్ధత
పుదుచ్చేరి ఇండియా కూటమిలోని డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీల మధ్య అభ్యర్థుల ఖరారుపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో అసలు ఈ కూటమి కలిసి పోటీ చేస్తుందా? లేక విడివిడిగానే బరిలోకి దిగుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కూడా పంచాయతీ సాగినా ఫలితం అన్నది వెలువడలేదు. డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌తో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం భేటీ కూడా అయ్యారు. అయితే అర్ధరాత్రి వరకు లెక్క తేలలేదు. సోమవారం ఉదయం పంచాయతీ కొలిక్కివ చ్చేనా అన్న ఉత్కంఠ నెలకొంది.
నేటితో సమాప్తం
పుదుచ్చేరిలోని ఎన్‌డీఏ కూటమి ఖారైంది. ఇందులో ఎన్‌ఆర్‌కాంగ్రెస్ 16 చోట్ల, బీజేపీ పది చోట్ల, అన్నాడీఎంకే రెండు చోట్ల, లక్ష్య జననాయగ కట్చి రెండు చోట్ల పోటీ చేయనున్నది. ఈ అభ్యర్థులు నామినేషన్లు వేసే పనిలో బిజీ అయ్యారు. తనకు సీటు రాక పోవడంతో బీజేపీ ఎమ్మెల్యే సాయి శరవణన్ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఇక బీజేపీలో తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించినా, ఓ అభ్యర్థి ఎవరో అన్నది సోమవారం తేలనున్నది. ఇప్పటివరకు ముఖ్యమంత్రి రంగసామి, మంత్రులు నమశ్శివాయం, తిరుమురుగన్, స్పీకర్ సెల్వం సహా మొత్తం 135 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనున్నది. దాదాపుగా స్వతంత్ర అభ్యర్థులు, ఎన్‌డీఏ కూటమి వర్గాలు నామినేషన్లు సమర్పించడం పూర్తి అవుతుంది. అయితే, ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌లో టెన్షన్ అన్నది నెలకొని ఉంది. చివరి నిమిషంలోనైనా సయోధ్య కుదురుతుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పుదుచ్చేరి అసెంబ్లీ


