సాక్షి, చైన్నె: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో శనివారం అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ సమావేశమయ్యారు. తమ పార్టీకి సీట్ల సర్దుబాటు విషయంగా చర్చలు జరిపారు. అమిత్ షా అజ్ఞలకు అనుగుణంగా నడుచుకునేందుకు టీటీవీ సన్నద్ధమయ్యారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామినేతృత్వంలోనే కూటమి అని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే , బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటు ఢిఢిల్లీలోని కేంద్ర హో మంత్రి అమిత్ షా నివాసం వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి రెండుసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. బీజేపీకి 31 సీట్లు కేటాయించారన్న సమాచారాలు వెలువడ్డాయి. అయితే, తమకు అధిక సీట్లు ఇవ్వాలన్న అమ్మమక్కల్ మున్నేట్ర కళగంకు అమిత్ షా ద్వారా నే చెక్ పెట్టించే ప్రయత్నంలో పళణి సఫలీకృతులయ్యారు.
టీటీవీ భేటీ
అమిత్ షాతో శనివారం గంటన్నర పాటూ టీటీవీ దినకరన్ సమావేశమయ్యారు. సీట్ల సర్దుబాటు విషయంగా అమిత్ షా ఆజ్ఞలకు అనుగుణంగా అడుగులు వేయడానికి టీటీవీ సిద్ధమయ్యారు. ఇందుకు అనుగుణంగా మీడియాతో మాట్లాడుతూ, ఆయన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వంలోనే కూటమి ఎన్నికలను ఎదుర్కొంటుందన్నారు. విజయ్ టీవీకేను చర్చలకు ఆహ్వానించ లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. ఇదంతా మీడియా సృష్టిం, ప్రచారం మాత్రమేనని వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి ఖరారైందని, తాము పంచ పాండవులం అని పేర్కొంటూ, దుర్యోదన డీఎంకే కూటమిని చిన్నా భిన్నం చేస్తామని, వారిని గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు. కాగా టీటీవీ పార్టీకి తొమ్మిది, పీఎంకే అన్బుమణికి 17 సీట్లు ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ఈ భేటీ ముగియగానే, ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి పీయూస్ గోయల్ సమక్షంలో సీట్ల ఒప్పందాలు జరగబోతున్నాయని కూటమీ నేతలు పేర్కొంటున్నారు.


