– అన్నాడీఎంకే కూటమి నేతలలో అసంతృప్తి
సాక్షి, చైన్నె: తిరుచ్చిలోనూ అన్నాడీఎంకే సీట్ల పంపకాల లెక్క తేలనట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో నేతలందరూ అసంతృప్తితో వెనుదిరగాల్సి వచ్చినట్టు సమాచారం. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, అన్బుమణి పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, అమ్మమక్కల్ మున్నేట్ర కళగం, ఐజేకే, పుది నీది తదితర పార్టీలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో అన్నాడీఎంకే కీలకంగా ఉంది. ఆ తదుపరి బీజేపీ జాబితాలో ఉంది. గత నెల మదురైలో సీట్ల పంపకాల చర్చ అసంతృప్తికరంగా ముగిసిన నేపథ్యంలో బుధవారం తిరుచ్చిలో మరో మారు నేతలందరూ ఏకమయ్యారు. పీఎం మోదీ సమక్షంలో చేతలు కలిపారు. బహిరంగ సభ వేదికపై నేతలందరూ పలకరింపులతో కనిపించినా ఆతదుపరి సీట్ల పంపకాల విషయంలో ఏ మాత్రం తగ్గనట్టు సమాచారం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్ ,కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ సమక్షంలో సీట్ల పంపకాల చర్చలు జరిగినట్టు సమాచారం. ఇందులో బీజేపీ పట్టువీడక పోవడం, అమ్మ మక్కల్ మున్నేట్రకళగం సైతం 30 సీట్లను ఆశిస్తుండటం వంటి పరిణామాలతో చర్చలు అసంతృప్తికరంగాముగిసినట్టు నేతలు పేర్కొంటున్నారు. పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్ , ఇతర పార్టీలు మెట్టు దిగినా, బీజేపీ,అ మ్మ మక్కల్ మున్నేట్ర కళగం రూపంలో అస్సలు చిక్కులు తప్పన్నట్టుచర్చ జరుగుతోంది. మిత్రలందరికి 70లోపు సీట్లను సర్దుబాటు చేసి , మిగిలిన 160 స్థానాలలో తాము పోటీచేసే దిశగా అన్నాడీఎంకే వ్యూహరచన చేసి ఉన్నట్టు తెలిసింది. మిత్రులు కొందర్ని తమ రెండాకు చిహ్నంలో పోటీ చేయాలన్న నిబంధనలను అన్నాడీఎంకే విధించినట్టు పేర్కొంటున్నారు. మదురై తదుపరి తిరుచ్చి భేటీ సైతం అసంతృప్తికరంగా ముగిసిన నేపథ్యంలో తదుపరి సమావేశం ఎక్కడో అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా పీఎంకే నేత అన్బుమణి సతీమణి సౌమ్య అన్బుమణి ఈసారి ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆ సీటు ఆశిస్తుండటంతో అక్కడి అన్నాడీఎంకే నేతలు గుర్రు మంటున్నట్టు సమాచారం.


