సాక్షి, చైన్నె: భారతదేశ పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రముఖ విద్యాసంస్థ ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ముందడుగు వేసింది. తాను అభివృద్ధి చేసిన అత్యాధునిక ’సోలార్ సెల్ ఎన్‌క్యాప్సులెంట్’ (సౌర విద్యుత్ మినకల రక్షణ కవచం) సాంకేతికతను వాణిజ్యీకరించేందుకు చైన్నెకి చెందిన అనాబాండ్ లిమిటెడ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సాంకేతికత లైసెన్స్ కోసం అనాబాండ్ సంస్థ ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయానికి రూ. కోటి చెల్లించనుంది. దీనితో పాటు, రాబోయే ఏడేళ్ల పాటు ఈ సాంకేతికత ద్వారా జరిగే విక్రయాలపై నిర్ణీత రాయల్టీని కూడా విశ్వవిద్యాలయానికి అందజేస్తుంది. సోలార్ ప్యానెల్స్‌ను ఎండ, దుమ్ము, తేమ నుండి రక్షించి, వాటి జీవితకాలాన్ని 25 నుంచి 30 ఏళ్ల వరకు పెంచడంలో ఈ ఎన్‌క్యాప్సులెంట్ సాంకేతికత కీలకం కానుంది. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ఎం ప్రో–ఛాన్సలర్ డాక్టర్ పి. సత్యనారాయణన్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనలు కేవలం పత్రాలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలుగా మారాలన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతికతను అందించడమే లక్ష్యంగా పేర్కొన్నారు.
త్వరలోనే వర్సిటీ ప్రాంగణంలో ఇండస్ట్రియల్ రీసెర్చ్ పార్క్‌ను ఏర్పాటు చేయబోతున్నాం అని ప్రకటించారు. వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సి. ముత్తమిళసెల్వన్ మాట్లాడుతూ, తమ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ కె.అనంతనారాయణన్ నేతత్వంలోని బందం గత 5 ఏళ్లుగా శ్రమించి ఈ పాలిమర్ రక్షణ కవచాన్ని అభివృద్ధి చేసిందన్నారు. కార్యక్రమంలో అనాబాండ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. రాజన్ పాల్గొన్నారు.


