తిరుచ్చి గడ్డపై డీఎంకే శంఖారావం | - | Sakshi
Sakshi News home page

తిరుచ్చి గడ్డపై డీఎంకే శంఖారావం

Mar 8 2026 7:59 AM | Updated on Mar 8 2026 7:59 AM

● రేపు భారీ బహిరంగ సభ ● 2026 ఎన్నికల విజయమే లక్ష్యం ● కేడర్‌కు స్టాలిన్‌ లేఖ

సాక్షి, చైన్నె : తమిళనాడు రాజకీయాల్లో మరో చారిత్రక ఘట్టానికి తిరుచ్చి నగరం వేదిక కానుంది. ‘స్టాలిన్‌ కొనసాగాలి – తమిళనాడు గెలవాలి‘ అనే నినాదంతో సోమవారం తిరుచ్చి సమీపంలోని సిరుగనూర్‌లో భారీ బహిరంగ సభతో ఎన్నికల శంఖారావం పూరించేందుకు డీఎంకే సిద్ధమైంది. ఈ మహానాడుకు కేడర్‌కు పిలుపు నిస్తూ డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ శనివారం లేఖ రాశారు. ఈమేరకు డీఎంకే చరిత్రలో తిరుచ్చికి ఉన్న ప్రాముఖ్యత, ప్రాధాన్యతను శనివారం స్టాలిన్‌ లేఖ ద్వారా కార్యకర్తలకు గుర్తుచేశారు. 1956లో దివంగత నేత అన్నాదురై నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది ఇక్కడే అని పేర్కొన్నారు. 1957లో దివంగత నేత కరుణానిధి ఇక్కడి కుళితలై నియోజకవర్గం నుండి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొన్నారు. 1970లో పార్టీ ఐదు ప్రధాన సూత్రాలను ఇదే గడ్డ నుంచే కరుణానిధి ప్రకటించారన్నారు.

ద్రవిడ మోడల్‌ 2.ఓ లక్ష్యం

2021 ఎన్నికలకు ముందు ఇదే సిరుగనూర్‌ వేదికగా ప్రకటించిన మహిళలకు రూ. 1000 గౌరవ వేతనం పథకం నేడు కోట్లాది మందికి అందుతోందని స్టాలిన్‌ పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో తమిళనాడు 11.19 శాతం ఆర్థిక వృద్ధితో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగాయని స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ’ద్రవిడ మోడల్‌ 2.ఓ’ పాలనను అందించడమే లక్ష్యమని తెలిపారు. శుక్రవారం చైన్నెలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించిన 14 అంశాల ‘తమిళనాడు 2030‘ విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా, పార్టీ ఆవిర్భావం నుండి తిరుచ్చిలో జరిగిన ప్రతి సభ ఒక మలుపుగా నిలిచిందని గుర్తు చేస్తూ, హిందీకి వ్యతిరేకంగా పోరాడిన నేల తిరుచ్చి అనిపేర్కొంటూ, ‘చరిత్ర సృష్టించేందుకు కదిలి రండి తోబుట్టువులారా... తిరుచ్చి దద్దరిల్లాలి, డీఎంకే గెలవాలి!‘ అని ముగించారు. కాగా, ఈ మహానాడు ఏర్పాట్లను మంత్రి కే.ఎన్‌. నెహ్రూ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. లక్షలాదిగా తరలిరానున్న కార్యకర్తల కోసం సిరుగనూర్‌ ప్రాంతం తాజాగా నలుపు, ఎరుపు రంగులో సాగరాన్ని తలపించే విధంగా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement