● హైకోర్టు సీజేతోనూ..
సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవితో శనివారం సీఎం స్టాలిన్ సమావేశమయ్యారు. లోక్ భవన్‌లో అర్ధగంట పాటూ ఇద్దరు మాట్లాడుకున్నారు. రాష్ట్ర గవర్నర్‌గా పగ్గాలు చేపట్టినప్పట్టి నుంచి డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్‌ఎన్ రవి వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. రానురానూ వివాదం ముదిరింది. కోర్టుకు సైతం వ్యవహారం చేరింది. అసెంబ్లీ వేదికగా సైతం వివాదం, చర్చ తప్పలేదు. దీంతో గవర్నర్ అధికారిక కార్యక్రమాలను డీఎంకేతో పాటూ మిత్ర పక్షాలు బహిష్కరిస్తూ వచ్చాయి. విశ్వవిద్యాలయాలలో జరిగే స్నాతకోత్సవాలకు మంత్రులు సైతం దూరంగా ఉంటూ వచ్చారు. సీఎం స్టాలిన్ అయితే, గవర్నర్ తీరుపై పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో విరుచుకు పడి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్‌ఎన్ రవి పశ్చిమ బెంగాల్‌కు బదిలీ అయ్యారు. ఈ బదిలీ ఎందుకో అని..? కేంద్రాన్ని ప్రశ్నిస్తూ స్టాలిన్ లేఖ సైతం విడుదల చేశారు. ఈ బదిలీలు, కొత్త నియమకాల వెనుక ఎన్నికల వేళ ఆంతర్యం ఉందా? అని ప్రశ్నలు సందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బదిలీపై వెళ్తున్న గవర్నర్ రవిని మర్యాద పూర్వకంగా కలిసి వీడ్కోలు పలికేందుకు సీఎం స్టాలిన్ లోక్ భవన్‌కు శనివారం ఉదయం వెళ్లారు. ఆయన్ని కలిసి సత్కరించారు. తమిళ మహాకవి తిరువళ్లువర్ విగ్రహాన్ని కానుకగా అందజేశారు. కాసేపు ఇద్దరు మాట్లాడుకోవడం విశేషం. అనంతరం మద్రాసు హైకోర్టుకు కొత్త సీజేగా నియమితులైన శుష్రత్ అరవింద్ ధర్మాధికారిని కలిసి సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాసేపు సీజేతో మాట్లాడి బయటకు వచ్చేశారు.


